ఇది కదా నీ అసలు టాలెంట్, సంజూ రికార్డుల మోత

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలవుతాడు అన్న విమర్శలకు సంజూ శాంసన్ ఇక చెక్ పెట్టినట్టే అనిపిస్తోంది. పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటడంతో ఒకదశలో ఈ కేరళ క్రికెటర్ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది.

  • Written By:
  • Publish Date - November 9, 2024 / 05:53 PM IST

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలవుతాడు అన్న విమర్శలకు సంజూ శాంసన్ ఇక చెక్ పెట్టినట్టే అనిపిస్తోంది. పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటడంతో ఒకదశలో ఈ కేరళ క్రికెటర్ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. అయితే ఇదే చివరి ఛాన్స్ కావొచ్చేమో అనుకున్న దశలో బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపికయ్యాడు. ఉప్పల్ స్టేడియంలో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. తనపై ఉన్న ఒత్తిడిని చిత్తు చేస్తూ హైదరాబాద్ లో శివతాండవం ఆడేశాడు.ఇపుడు అదే ఫాంను కంటిన్యూ చేస్తూ సఫారీ గడ్డపైనా పక్కా మాస్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.

శతకంతో కదం తొక్కిన సంజు శాంసన్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్ శాంసన్. అతని కంటే ముందు గుస్తావ్ మెకియాన్, రొసోవ్, ఫిల్ సాల్ట్ ఈ ఘనత సాధించారు. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా శాంసన్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది.

అటు రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డును కూడా సంజు శాంసన్ సమం చేశాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాటర్‌గా రోహిత్ సరసన సంజు శాంసన్ నిలిచాడు. 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఈ రికార్డు డర్బన్‌లో శాంసన్ సమం చేశాడు. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా శాంసన్ మరో ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్, రొసోవ్ పేరిట ఉండేది. వీరిద్దరు 9 సిక్సర్లు సాధించారు.ఈ ఇన్నింగ్స్ ను స్టేడియంలో ఫ్యాన్స్ తో పాటు సంజూ ఫ్యాన్స్ కూడా బాగా ఆస్వాదించారు. ఇక సంజూ టైమొచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కేరళ క్రికెటర్ జోరు ఇలాగే కొనసాగితే టీ ట్వంటీ జట్టులో ప్లేస్ సుస్థిరం చేసుకోవచ్చు.