SANKRANTI KITES: పతంగులు ప్రాణాలు తీస్తున్నాయ్..! అమాయకుల పీకలు కోస్తున్నాయ్..! నాలుగు రోజుల్లో ఏకంగా 11 ప్రాణాలు బలిగొన్నాయ్ పతంగులు..! గాలిపటాలు ఎగరేస్తూ కొందరు చనిపోగా.. చైనా మాంజాకి బలయ్యారు మరొకరు. పండగ.. పలువురి జీవితాల్లో విషాదం నింపింది. పతంగుల పండుగల సంక్రాంతి వచ్చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. డీజే పాటలకు స్టెప్పులేస్తూ.. గాలిపటాలు ఎగరేస్తూ.. పక్కోడి పతంగి కట్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. సరదా కోసమనో.. సంప్రదాయమనో.. ఎగరేస్తున్న పతంగులు ప్రాణాలమీదకు వస్తున్నాయి. కైట్స్ ఎగరేసేందుకు వాడే మాంజా.. అమాయకుల పీకలు కోస్తున్నాయ్. అత్తాపూర్‌లో పండగపూట విషాదం చోటుచేసుకుంది. తనిష్క్ అనే 13 ఏళ్ల బాలుడు పతంగికి బలయ్యాడు. సరదాగా ఇంటి మేడపై గాలిపటం ఎగరేస్తున్న తనిష్క్.. బిల్డింగ్ పైనుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలై.. అక్కడికక్కడే చనిపోయాడు.
KTR: పెండింగ్ బిల్లులపై సర్పంచ్‌ల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా: కేటీఆర్
అప్పటిదాకా.. ఆడుతూ పాడుతూ.. సరదాగా ఎగిరిగంతులేసిన తనిష్క్.. క్షణాల్లో ప్రమాదానికి గురయ్యాడు. పండగపూట తమ కొడుకు చనిపోవడంతో శోకసంద్రంలో మునిగింది కుటుంబం. నాగోల్‌లోనూ ఇలాంటి విషాదమే జరిగింది. గాలిపటం ఎగరేస్తూ 13ఏళ్ల శివప్రసన్న అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. నాలుగంతస్తుల బిల్డింగ్ పైనుంచి గాలిపటం ఎగరేస్తుండగా, పొరపాటున జారి బిల్డింగ్ పైనుంచి కిందపడ్డాడు. ఎత్తు నుంచి పడటంతో తీవ్రగాయాలపాలై స్పాట్లోనే చనిపోయాడు శివప్రసన్న. లంగర్‌హౌజ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గాలిపటం చైనా మాంజాకు ఓ ఆర్మీ జవాన్ బలయ్యాడు. విధులు ముగించుకుని బైక్‌పై లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న జవాన్ కోటేశ్వర్‌రెడ్డి మెడకు చైనా మాంజా బిగించుకుంది. మాంజా ధాటికి జవాన్ పీక లోతుగా కట్ అయ్యింది. ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు కోటేశ్వర్‌రెడ్డి. వైజాగ్‌కి చెందిన కోటేశ్వర్‌రెడ్డి ఆర్మీ హాస్పిటల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పేట్ బషీరాబాద్ పరిధిలోని కొంపల్లి ఎన్‌ఎస్‌ఎల్ నార్త్ కాలనీలో ఓ ఇంజనీరింగ్ యువకుడు పతంగికి బలయ్యాడు. పతంగి ఎగరేస్తూ.. ఆకాష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కిందపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. స్నేహితులతో కలిసి కైట్స్ ఎగరేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాష్ తండ్రి ఆల్వాల్ పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.
REVANTH REDDY: కేసీఆర్ బ్యాచ్‌ను ఊడ్చేసే పనిలో రేవంత్.. కలుగుల్లో దాగిన వాళ్లను బయటకు తెచ్చే జీవో..
అప్పటివరకు సరదాగా గడిపిన స్నేహితుడు కళ్లముందే క్షణాల్లో చనిపోవడంతో శోకసంద్రంలో మునిగారు స్నేహితులు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మరో దారుణం జరిగింది. పిల్లలు గాలిపటం ఎగరేస్తుండగా.. గాలిపటం కరెంట్ వైర్లకు చిక్కుకుంది. పిల్లలు గాలిపటం తీసి ఇవ్వమని కోరడంతో.. తండ్రి గాలిపటాన్ని తీసే ప్రయత్నం చేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్‌కి గురై చనిపోయాడు తండ్రి. షాక్ కారణంగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న భార్య మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. ఆమెకూ గాయాలయ్యాయి. అచ్చంపేటలోనూ మరో విషాదం జరిగింది. గాలిపటం ఎగరేస్తుండగా.. 12 ఏళ్ల జోహెబ్ కరెంట్ షాక్‌కి గురై చనిపోయాడు. స్నేహితులతో కలిసి కైట్స్ ఎగరేస్తుండగా.. గాలిపటం కరెంట్ తీగలకు చిక్కుకుంది. దాన్ని తీసే ప్రయత్నం చేస్తుండగా.. షాక్‌కి గురయ్యాడు జోహెబ్. రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలోనూ విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల లక్ష్మీ వివేక్.. కరెంట్ తీగలకు చుట్టుకున్న గాలిపటం తీయబోయి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఒక్కసారిగా హైటెన్షన్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. కడుపు పూర్తిగా కాలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వివేక్ మృతి చెందాడు.
కోరుట్ల కల్లూరు రోడ్‌లోనూ పెద్ద ప్రమాదం జరిగింది. బంగ్లాపై పతంగులు ఎగరేస్తుండగా 33 కేవీ విద్యుత్ లైన్ తగిలి సాత్విక్, ప్రశాంత్ అనే ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మరో విషాదం జరిగింది. తెగిపోయి గాలిలో వేలాడుతున్న గాలిపటం పట్టుకునేందుకు వెళ్లి.. కరణ్ సింగ్ అనే 21 ఏళ్ల యువకుడు ట్రాన్స్ఫార్మర్‌పై పడి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి కరన్ సింగ్‌ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామబాద్ ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి సరదా.. సంప్రదాయంలో భాగంగా.. చిన్నా పెద్దా తేడా లేకుండా.. పతంగులు ఎగరవేయడంలో సందడే వేరు. ఈ సరదా ప్రాణాల మీదకొస్తోంది. చైనీస్ మాంజాతో మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి ముప్పుగా మారడంతో చైనీస్ మంజా, నైలాన్ గ్లాస్ కోటెడ్ మాంజాలపై నిషేధం విధించారు అధికారులు. మార్కెట్లో ఇలాంటి మాంజాలకే డిమాండ్ ఎక్కువ ఉంటుండటంతో.. ఓ వైపు నిషేధం ఉన్నా సీక్రెట్‌గా అమ్ముతున్నారు కొందరు వ్యాపారులు.