ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి మొదలుకానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. సాధారణంగా భారత్ ఆసీస్ ఎప్పుడు తలపడినా క్రేజ్ ఉంటుంది కానీ ఈ సారి క్రేజ్ రెండు.మూడు రెట్లు ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా గత రెండు పర్యాయాలు కంగారూలను వారి సొంతగడ్డపైనే టీమిండియా చిత్తుగా ఓడించడం ఒకటయితే… ఈ సారి భారత్ ఒత్తిడిలో ఉండడం మరొక కారణం. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవంతో భారత్ ఎలా ఆడబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్ కు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుందన్న అంచనాలున్నాయి. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ మార్క్ తగ్గింది. ఒకవిధంగా చూస్తే మిగిలిన స్టార్ ప్లేయర్స్ తో పోలిస్తే పరుగుల వేటలో విరాట్ వెనుకబడ్డాడనే చెప్పాలి. దీంతో తనకు కలిసొచ్చిన కంగారూ గడ్డపై కోహ్లీ మళ్ళీ ఫామ్ అందుకుంటాడన్న అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోహ్లీ ఫామ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చని అంచనా వేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో కోహ్లీ మళ్లీ ఫాంలోకి వస్తాడని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. మునుపటి విరాట్ ను అభిమానులు మళ్ళీ చూస్తారంటూ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఒక ఛాంపియన్ బ్యాటర్ అనీ, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో ఎన్నోసార్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చాడన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడని దాదా చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఫామ్ , టెస్టులు ఆడేందుకు ఇదే చివరి ఆసీస్ టూర్ కావొచ్చన్న అంచనా.. ఇలా ఏ విధంగా చూసినా విరాట్ కు ఇది ప్రతిష్టాత్మక సిరీస్ అవుతుందని గంగూలీ విశ్లేషించాడు.
న్యూజిలాండ్ తో సిరీస్ ఓటమిని ఆసీస్ టూర్ తో ముడిపెట్టి చూడలేమని దాదా అభిప్రాయపడ్డాడు. ఆసీస్ పిచ్ లు వేరేలా ఉంటాయని, అక్కడ మన బ్యాటర్లు ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారని అంచనా వేశాడు. కాగా కివీస్ తో వైట్ వాష్ పరాభవం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఆసీస్ టూర్ లో కనీసం 4-0తో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే సమీకరణాలతో సిరీస్ గెలిస్తే మాత్రం ఇతర జట్ల సిరీస్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇటు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి కంగారూలు తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది.