TS, Second Deputy CM : రేవంత్ కేబినెట్ లో సెకండ్ డిప్యూటీ.. బీసీ లేదా మైనార్టీకి అవకాశం ?

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళితుడైన మల్లు భట్టి విక్రమార్కకు (CM Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. ఇప్పుడు మైనారిటీ లేదా బీసీకి చెందిన మరో నేత... సెకండ్ డిప్యూటీ సీఎంగా కేబినెట్ లో చేరబోతున్నాడు.

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళితుడైన మల్లు భట్టి విక్రమార్కకు (CM Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. ఇప్పుడు మైనారిటీ లేదా బీసీకి చెందిన మరో నేత… సెకండ్ డిప్యూటీ సీఎంగా కేబినెట్ లో చేరబోతున్నాడు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో…ఈ నియామకం ఉండొచ్చని తెలుస్తోంది. భట్టికి ఆర్థిక శాఖ లాంటి కీలక పదవి ఇచ్చినట్టే… రెండో డిప్యూటీకి హోంశాఖతో పాటు ఇతర ముఖ్య శాఖలు కేటాయిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ఓడిపోయి… కాంగ్రెస్ (Congress) అధికారం రావడంతో ముఖ్యమంత్రి పోస్ట్ కోసం పార్టీ సీనియర్లు చాలా మంది పోటీ పడ్డారు. ఎన్నో యేళ్ళుగా పార్టీని అంటిపెట్టుకొని ఉండి… పాదయాత్ర ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) కు ఇమేజ్ తెచ్చిన మల్లు భట్టి విక్రమార్క కూడా సీఎం పోస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కి ఛాన్స్ ఇవ్వడంతో… దళిత నేత, సీనియర్ వ్యక్తిగా భట్టికి డిప్యూటీ సీఎంగా సముచిత గౌరవం కల్పించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన కేబినెట్ లో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని… మరో డిప్యూటీ సీఎంకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

భట్టికి ఫైనాన్స్ లాంటి ప్రాధాన్యత పోర్ట్ ఫోలియో ఇచ్చినట్టే… రెండో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోయే నేతకు హోంశాఖతో పాటు ఇతర కీలక శాఖలను ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కో డిప్యూటీ సీఎం ఉన్నారు. కానీ పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని జగన్ కేబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. సామాజిక న్యాయం పాటించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అతి ఎక్కువ డిప్యూటీలు కొనసాగుతోంది కూడా ఏపీలోనే. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు చొప్పున డిప్యూటీ సీఎంలు ఉన్నారు.

ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గంలో 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రులు పోను… ఇంకా 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలను లెక్కలోకి తీసుకొని… లోక్ సభ ఎన్నికల లోపే మంత్రివర్గాన్ని విస్తరించాలని రేవంత్ నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఎంపికైన ప్రొఫెసర్ కోదండరామ్ కి విద్యాశాఖ మంత్రిగా పదవి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. ఆయనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ని కూడా ఎమ్మెల్సీని చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే… అలీఖాన్ ను సెకండ్ డిప్యూటీ సీఎంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ముస్లింలకు ఇప్పటికే చాలా ప్రాధాన్యత ఇచ్చారనీ… బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ వస్తోంది. కామారెడ్డిలో ఓడిపోయిన షబ్బీర్ అలీని గవర్నమెంట్ అడ్వైజర్ గా, అలీఖాన్ ని ఎమ్మెల్సీగా, అమీర్ ఉల్లా ఖాన్ ను TSPSC మెంబర్ గా అవకాశం కల్పించారు. అందువల్ల తెలంగాణలో బీసీలు ఎక్కువ మంది ఉన్నందున ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ లీడర్లు వాదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డిని లోక్ సభ ఎన్నికల దాకా కొనసాగించే అవకాశం ఉంది. ఈ పోస్టు కూడా తమ వర్గానికే దక్కాలని కాంగ్రెస్ లో బీసీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం ఏం చెబుతుందో దాని ప్రకారం రేవంత్ రెడ్డి నడుచుకునే అవకాశాలు ఉన్నాయి.