Ayodhya Ram Mandir: భారీ భద్రత మధ్య అయోధ్య.. పదివేల మందితో బందోబస్తు

దాదాపు దేశంలోని అత్యధిక వీవీఐపీలు హాజరవ్వబోతున్న అతిపెద్ద ఈవెంట్ ఇది. దేశంతోపాటు ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 07:24 PM IST

Ayodhya Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమవుతోంది. మరో నాలుగు రోజుల్లోనే సీతా సమేతంగా శ్రీరామ చంద్రుడు అయోధ్యలో కొలువుదీరబోతున్నాడు. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు దాదాపు ఏడున్నర వేల మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా, ఆధ్యాత్మికం సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవ్వబోతున్నారు.

Ayodhya Ram Mandir: రామయ్య సన్నిధికి వెంకన్న ప్రసాదం.. అయోధ్యకు తిరుపతి లడ్డూలు..

దాదాపు దేశంలోని అత్యధిక వీవీఐపీలు హాజరవ్వబోతున్న అతిపెద్ద ఈవెంట్ ఇది. దేశంతోపాటు ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అటు కేంద్రంతోపాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా భద్రతను పర్యవేక్షిస్తోంది. యూపీకి చెందిన ఏటీఎస్, ఎస్‌టీఎఫ్, పీసీఎస్, యూపీఎస్ఎఫ్‌, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది అయోధ్యలో రక్షణ బాధ్యతలు చూస్తున్నారు. రామ మందిరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ యూపీ బలగాలు, కేంద్ర పారా మిలిటరీ బలగాలు భద్రతలో పాలుపంచుకుంటున్నాయి. పది వేల మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 100కుపైగా డీఎస్పీలు, 325 మంది ఇన్‌స్పెక్టర్లు, 800 మంది ఎస్‌ఐలు విధుల్లో పాలుపంచుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో పని చేసేలా పది వేలకుపైగా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. అయోధ్య మొత్తం డ్రోన్లతో నిఘా పెట్టారు.

అనుమానాస్పద వస్తువులు ఆకాశ మార్గం నుంచి రాకుండా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోమ్ ఏర్పాటు చేశారు. అలాగే ఏ పరిస్తితినైనా ఎదుర్కొనేందుకు వాయుసేన కూడా సిద్ధంగా ఉంది. మరోవైపు భద్రతాపరమైన రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా బార్ కోడింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. యూపీ-నేపాల్ సరిహద్దులోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. వారంపాటు జరిగే ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశ పూజ నిర్వహించారు. అయితే, అయోధ్యలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ వేడుకల సందర్భంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.