పోలీసులు అరెస్ట్ చేసి.. మళ్లీ వదిలేసినా.. సీమా విషయంలో నిఘా సంస్థలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయ్. ఈమె పాక్ ఏజెంట్ అనే సందేహాలు రోజురోజుకు బలపడుతున్నాయ్. సీమా, హైదర్‌ను విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయ్. సీమా సోదరుడు ఆసిఫ్… పాకిస్థాన్ సైన్యంలో ఉన్నాడు. అతనితో పాటు సీమా బంధువు కూడా పాక్ సైన్యంలో ఉన్నతస్థాయిలో ఉన్నారు. సీమా హైదర్‌తోపాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్, అతడి తండ్రిని యూపీ ఏటీఎస్ అధికారులతోపాటు, ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
ఆమెకు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సీమా పేరిట ఉన్న పాకిస్థాన్ గుర్తింపు కార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటితోపాటు ఆమె పాస్‌పోర్ట్, ఇతర ధ్రువపత్రాలు, పిల్లల వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సీమా సోదరుడు పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్నాడన్న వార్తలు బయటికి రావడంతో.. ఆమె చుట్టూ మరిన్ని అనుమానాలు బలంగా మారుతున్నాయ్.
వీసా లేకుండా పాకిస్తాన్ నుంచి ఇండియాకు దొంగదారిలో రావడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది ఈ మహిళ ఇంత సులభంగా వచ్చిందంటేనే రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. దీనికి తోడు నయా పైసా లేని సచిన్‌లాంటి వాడి కోసం.. పాకిస్తాన్‌లో ఆస్తులను, నలుగురు పిల్లలను, భర్తను వదిలేసి రావడం ఏంటనే మరో అనుమానం కలుగుతుంది. ఇవన్నీ వదిలేస్తే.. హనీ ట్రాప్ చేయడం, ఇండియాలోకి అడుగు పెట్టడం పాకిస్తాన్‌కు కొత్తేం కాదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సీమా వ్యవహారం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి దేశం అంతా ఎదురుచూస్తోంది.