ఎన్నికలు రాగానే ఏ వర్గం వారు ఏ గట్టున ఉంటారో అనే విశ్లేషణలు, లెక్కలు మొదలవుతాయి. వీటిచుట్టూనే రాజకీయాలు తిరుగుతుంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపు..? అనే చర్చ కూడా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్ ఓటర్లున్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదలైన సెంటిమెంట్, సెటిలర్ల ప్రభావం ప్రతి ఎన్నికల్లోనూ ఉంటోంది. ఉద్యమ సమయంలో సెటిలర్లపై ద్వేషపూరితమైన ప్రసంగాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలు 2014 తర్వాత వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఉద్యమ సమయంలో ప్రచారం జరిగినట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెటిలర్లపై వివక్ష ఉంటుందని, వారిపై దాడులు జరుగుతాయనే వ్యాఖ్యలు.. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిజం కాలేదు. దాంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, సెటిలర్లు అత్యధిక శాతం బీఆర్‌ఎస్‌కు అండగా నిలబడి ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి, బిజెపితో కలిసి పోటీ చేసింది. టిడిపి బలంగా ఉన్న స్థానాల్లో సెటిలర్లు ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే, మిగిలిన స్థానాల్లోని సెటిలర్లు ఎలాగూ రాష్ట్రం ఏర్పడింది కదా అన్న ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చారు.
హైదరాబాద్‌లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ చుట్టు పక్కల ఉన్న మరో 10 నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీలో 7స్థానాలు ఎంఐఎంకు పోను.. మిగతా 18కి పైగా నియోజకవర్గాల్లో ఆంధ్రా ఓట్లే కీలకంగా మారాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఉండటంతో పార్టీల చూపంతా ఇప్పుడు ఆంధ్రా సెటిలర్లపైనే పడింది. ప్రధానంగా కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్ సెగ్మెంట్లలో వీరి ప్రభావం అధికంగా ఉంది. కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లిలో గెలుపు, ఓటములను డిసైడ్ చేసేది సెటిలర్లే. గత ఎన్నికల్లో ముషీరాబాద్, అంబర్ పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్‌లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అలాగే సెటిలర్స్ అధికంగా ఉండే.. కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు.
ఈసారి కూడా సెటిలర్స్ బీఆర్‌ఎస్ వైపే నిలబడ్డారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌నే ఆదరించారు సెటిలర్స్. రాష్ట్రమంతటా హవా చూపించి అధికారం సాధించగలిగిన కాంగ్రెస్… హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనూ గెలవలేకపోయిందంటే అందుకు సెటిలర్స్ ఓటే కారణం. ఓ రకంగా బీఆర్ఎస్‌కు ఆ మాత్రం సీట్లు రావడానికి కారణం సీమాంధ్రులేనని విశ్లేషకులు అంటున్నారు. వారు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఉంటే బీఆర్ఎస్‌కు మరింత పరాభవం ఎదురయ్యేదంటున్నారు.