టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. రోహిత్ వారసునిగా హార్థిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. దీనికి తోడు వరల్డ్ కప్ లో పాండ్యా ఫామ్ అందుకోవడంతో అతని పేరే ఖాయమని భావించారు. అయితే కెప్టెన్ ఎంపిక విషయంలో సెలక్టర్ల మధ్య తీవ్ర కసరత్తు జరిగింది. పాండ్యా వైపు కొందరు, సూర్య వైపు కొందరు మొగ్గుచూపడం, గంభీర్ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంతో సెలక్టర్ల మధ్య తీవ్రమైన చర్చే జరిగినట్టు సమాచారం. చివరికి జట్టులో ఆటగాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నారని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ప్లేయర్లలో ఎక్కువమంది సూర్య వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. సూర్య సహచరులతో నడుచుకునే తీరు బీసీసీఐ సెలక్టర్లను ఆకర్షించింది. గతంలో దక్షిణాఫ్రికా పర్యటన జరుగుతుండగా…సూర్య కెప్టెన్ గా ఉన్నప్పుడే ఇషాన్ కిషన్ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు. అతడిని ఆపేందుకు సూర్య చాలా కష్టపడ్డాడని జట్టు వర్గాల ద్వారా సెలక్టర్లకు తెలిసింది. ప్లేయర్లతో మాట్లాడే విషయంలో పాండ్య కంటే సూర్యనే చాలా బెటర్ అని పలువురు ప్లేయర్స్ చెప్పినట్టు సమాచారం. రోహిత్‌లానే సూర్యకుమార్ సహచర ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తాడని గుర్తించిన సెలక్టర్లు అతన్నే ఎంపిక చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.