కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు.. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు.
డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. డీఎస్ పేరుతో రాజకీయాల్లో ప్రాచుర్యం పొందిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ NSUI ద్వారా పొలిటికల్ అరంగేట్రం చేశారు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన ఆయన CM రేసులో నిలిచినా చివరికి ఆ పదవి YSRకు దక్కింది. 2004-08 మధ్య కాలంలో ఉన్నతవిద్య, అర్బన్, లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారీ ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి తో 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి డీఎస్ BRSలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా రేపు డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఇందూరు పట్టణంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని డీఎస్ కుటుంబ సభ్యులు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత DS మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. DS పార్ధివదేహాన్ని హైదరాబాద్ నుంచి ఇవాళ సాయంత్రం నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లోని తన నివాసానికి తరలించనున్నారు. అంత్యక్రియలు జూన్ 30న జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఆయన సొంత నియోజకవర్గమైన ఇందూరు పట్టణంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని, ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.