శత్రువులు ఎక్కడో ఉండరు.. వాళ్లు వీళ్ల రూపంలో పక్కనే తిరుగుతుంటారని కాంగ్రెస్‌ను జోకులేస్తుంటారు రాజకీయం తెలిసినవాళ్లు ! హస్తం పార్టీలో పరిస్థితులు కూడా అలానే ఉంటాయ్. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో వాళ్ల నెత్తిన వారే చేతులు పెట్టుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే సీన్ ! తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయ్. రేవంత్ వర్సెస్ సీనియర్లు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. డిగ్గీ రావడం.. మాణిక్కం మారడం.. మాణిక్‌రావ్ చార్జ్ తీసుకోవడం.. అందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చినట్లు అనిపించడం.. రేవంత్ పాదయాత్ర మొదలుకావడం అన్నీ చకచకా జరిగిపోయాయ్. ఇక కాంగ్రెస్‌కు తిరుగులేదు. హస్తం పంచ్ పవర్ ఏంటో చూపిస్తామని ఆ పార్టీ కార్యకర్తలు తొడలు కొట్టేలోపే.. జరుగుతున్న పరిణామాలు మళ్లీ తొడపాశం పెట్టినట్లు అవుతోంది.
హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలుపెట్టిన రేవంత్.. బీఆర్ఎస్ సర్కార్ మీద మాటల దాడి పెంచారు. ప్రగతిభవన్ పేల్చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంటుంటే.. రేవంత్ అనుచరులు, మద్దతుదారులు సపోర్టు చేస్తున్నారు. ఐతే కాంగ్రెస్ సీనియర్లు మాత్రం సైలెంట్‌గా కనిపిస్తున్నారు. ఐతే వీళ్ల మౌనం వెనక కారణం.. కోపం తగ్గకపోవడమేనా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభోత్సవానికి పార్టీ సీనియర్ నేతలంతా దూరంగా ఉన్నారు. ఉత్తమ్, జగ్గారెడ్డి, భట్టి సహా… అనేకమంది నేతలు పాదయాత్ర వైపు చూడటం లేదు. ఇదే ఇలానే కొనసాగితే.. రేవంత్ పరిస్థితి ఏంటనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. నిజానికి రేవంత్ నడిచే ప్రతీచోట.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలే కనిపిస్తున్నారు తప్ప.. ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకులెవరూ పత్తాకు లేరు ! అంటే రేవంత్‌ను కావాలని దూరం పెడుతున్నారా.. దూరంగా జరుగుతున్నారా.. ఇదే పరిస్థితి కొనసాగితే పాదయాత్ర లక్ష్యం అసలు నెరవేరినట్లేనా అనే చర్చ జరుగుతోంది.
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిని మార్చడం మాత్రమే కాదు.. రేవంత్‌ను పీసీసీగా మార్చడం కూడా సీనియర్ల డిమాండ్. మొదటి డిమాండ్ నెరవేరింది. రెండోది మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ అసంతృప్తితో సీనియర్లలో మరింత కోపం పెంచిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. చెల్లాచెదురు అయిన పార్టీ శ్రేణులను ఒక్క చోటికి చేర్చడం.. కొత్త జోష్ నింపడమే రేవంత్ పాదయాత్ర లక్ష్యం. ఐతే ఇలా సీనియర్లు అంతా దూరంగా ఉండి.. రేవంత్ ఎవరు అన్నట్లు వ్యవహరిస్తే.. నడిచిన ఈయనకు ఆయాసం మిగిలడం తప్ప.. పార్టీకి ఒరిగేదేమీ లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.