ఈ కేసు ఇప్పుడు నమోదైంది కాదు. 2022 ఆగస్ట్ 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదు చేసినట్టు కేసులో ఉన్న 152 మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్లపై కేసు ఉన్నట్టు కూడా వాళ్లకు తెలియదు. కేసు వివరాలు మాత్రం చాలా సీక్రెట్‌గా ఉంచారు పోలీసులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పీపుల్స్ డెమొక్రటిక్ మూమెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిని రెండు నెలల క్రితం పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ కోసం చంద్రమౌళి కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ కోసం చంద్రమౌళి మీద ఉన్న అన్ని కేసుల వివరాలు ఇవ్వాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది.
పోలీసులు సబ్మిట్ చేసిన ఫైల్‌లో చంద్రమౌళిపై ఉపా కేసు ఉన్నట్టు కోర్టు గుర్తించింది. ఆ కేసు గురించి ఆరా తీయగా 152 మందిపై 2022లోనే కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. మావోయిస్టుల సమావేశం జరగబోతోందని సమాచారంతో ములుగు జిల్లా బీరెల్లిలో కూంబింగ్ నిర్వహించామని.. అక్కడ కొన్ని పుస్తకాలు దొరికాయని.. ఆ పుస్తకాల్లో ప్రజా సంఘాల నేతలతో మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు దొరికాయని పోలీసులు కోర్టుకు చెప్పారు. వాటి ఆధారంగానే 152 మందిపై కేసు పెట్టామని చెప్పారు. దీంతో ఈ కేసు విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమయంలో ప్రజా సంఘాల నేతలపై ఇలాంటి కేసు ఉన్న సంగతి బయటికి రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయడంతో ఆయన స్పదించి కేసు ఎత్తి వేశారు. అయితే పెట్టిన కేసును సంవత్సరం పాటు ఎందుకు గోప్యంగా ఉంచారో పోలీసులు మాత్రం వివరణ ఇవ్వలేదు.