స్కూల్‌కి పరుగుపరుగునా వెళ్లారు పిల్లలు.. వెళ్లగానే బెంచ్‌పై కుర్చున్నారు..సుర్రుక్కుమన్నది.. కింద కాలిపోయిందేమోనని డౌట్ వచ్చింది.. ఇంతలోనే పక్కన ఫ్రెండ్‌కు కూడా అలానే కాలింది. టైమ్ చూస్తే 8AM అయ్యింది..ఇదేంట్రా బాబు అనుకున్నారు.. పొద్దునే ఇంత ఎండ ఏంటో అర్థంకాలేదు. ఉదయం నాన్న న్యూస్ చూస్తుంటే ఏదో ఎన్‌నినో అని..తుపాన్ అని టీవీ వాళ్లు చెబుతున్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇక రోజు ఇలా కాలుతూనే ఉంటుందనుకుంటా అని అర్థమైయింది. అదే సమయంలో టీచర్ కూడా చమటలు కక్కుతూ క్లాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాసేపు కుర్చొని మంచినీళ్లు తాగింది.. ఫ్యాన్ కింద సేదతీరిన తర్వాత బోర్డుపై లెక్కలు రాయడం మొదలుపెట్టింది.. ఇది స్కూల్ మొదలైన దగ్గర నుంచి విద్యాసంస్థల్లో కొనసాగుతున్న పరిస్థితి..!
నిజానికి ఎండాకాలం విడతలవారిగా దంచికొడుతుంది. ఫిబ్రవరి చివరి నుంచి మెల్లిమెల్లిగా సూర్యుడు మనపై హీట్ కక్కడం ప్రారంభిస్తాడు. మార్చిలో చివరి నాటికి సెకండ్ గేర్ వేస్తాడు.. ఏప్రిల్‌లో లాస్ట్ వీక్‌కి మూడో గేర్ వేస్తాడు..మే 25న రోహిణి కార్తీ ఎంట్రీతో స్పీడోమీటర్ బద్దలయ్యేలా సెగలు పొగలు మన జీవితాలను కమ్మేస్తాయి.. ఆ తర్వాత వారం రోజుల వరకు అలానే ఉంటుంది. జూన్ 3 తర్వాత నుంచి కొద్దిగా గేర్ డౌన్ చేస్తాడు సూర్యుడు. అయితే ఈసారి గేర్ డౌన్ అవ్వడంలేదు.. బండి చెడిపోయినట్టుంది.. దానికి కారణం.. ఎల్‌నినో, బిపోర్‌జాయ్ తుపాను అని చెబుతున్నారు. రుతు పవనాలు ఆలస్యంగా వస్తున్నాయి..అందుకే చినుకు లేదు.. వాన కోసం రైతులే కాదు.. సామాన్యులు కూడా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపరించింది. నిజానికి జూన్ రెండో వారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకంటే బాగా తగ్గిపోవాలి. కానీ ఈసారి దానికి భిన్నంగా 40 డిగ్రీలకంటే ఎక్కువగా ఉండటం, వాతావరణంలో తేమశాతం పెరగడం.. ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరివుతున్నారు.
వేడి తట్టుకోలేని ప్రజలు ఏసీలు, కూలర్లతో కాలం గడుపుతున్నారు.. ఆ రెండు లేని వాళ్ల ఇళ్లలో చమటలు వరదలా కారుతోంది. ఇటు ఏసీ, కూలర్లతో పాటు కరెంట్ ఛార్జిల మోతతో వాటిని వినియోగిస్తున్న వారికి తడిసి మోపెడవుతుంది. సాధారణంగా ఏప్రిల్, మేలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. జూన్ 10 తర్వాత కాస్త తగ్గుతుంది.. కానీ ఈ సారి గత రెండు నెలలు లాగానే జూన్‌లోనూ కరెంట్ వినియోగం కొనసాగుతోంది. అసలు ఫ్యానో, కూలరో, ఏసీలో ఆఫ్ చేసే పరిస్థితి లేదు. అటు పొట్టకూటి కోసం కూలి చేసుకునే వాళ్ల దుస్థితి దయనీయంగా మారింది. ఈ మండుటెండల్లో పని చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి వాళ్లది! ఇటు ఎండల తీవ్రతకు చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఎండ తీవ్రత, వడగాలులకు డీహైడ్రేషన్, జ్వరం, డయేరియా తదితర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటికైనా సూర్యుడు తన ప్రతాపం తగ్గించాలని కోరుకుంటున్నారు. వరుణదేవుడు కరుణించాలని కొన్ని చోట్ల కప్పలకు పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. మరి చూడాలి జూన్ నాలుగో వారానికైనా భానుడు శాంతిస్తాడో లేకపోతే మరింత నిప్పుల కుంపటిని తలపిస్తాడో..!