వరదలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలకు మరో వార్నింగ్ ఇచ్చంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు.. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురవడం ఖాయం అంటోంది. ఏపీకి ఈ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. విషాదం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటే.. ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనంతో కోస్తా వణికిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో.. ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30కిలోమీటర్లుగా ఉంది. ఐతే ఏపీలో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ జనాలను.. ఈ వార్త మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్… కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలపై జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిందింది.
అటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షాలతో రాజానగరం మండలం గాడాల దగ్గర జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకుంది. రాజమండ్రి గామాన్ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఇక అటు తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశముంది.
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసిన అధికారులు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆల్రెడీ ఉదయం నుంచి తెలంగాణలో పలుచోట్ల వాన పడుతోంది. హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. అల్పపీడనం మరో 3 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయ్.