టీమిండియాకు షాక్ ఆసీస్ టూర్ కు షమీ లేనట్టే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనుకుంటున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ టూర్ మధ్యలోనైనా జట్టుతో చేరతాడనుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. అతని గాయం మళ్ళీ తిరగబెట్టినట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 07:15 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనుకుంటున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ టూర్ మధ్యలోనైనా జట్టుతో చేరతాడనుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. అతని గాయం మళ్ళీ తిరగబెట్టినట్టు సమాచారం. దీంతో ఆసీస్ టూర్ కు షమీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనట్టే. ఈ సీనియర్ పేసర్ భారత జట్టుకు దూరమై ఏడాది కావొస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయపడిన షమీ సర్జరీ చేయించుకున్నాడు. అయినప్పటికీ ఫిటెనెస్ సాధించడంలో విఫలమవుతున్నాడు. మధ్యలో చీలమండ గాయం మళ్ళీ తిరగబెట్టినట్టు వార్తలు రావడం, అప్పటి నుంచి జాతీయ క్రికెట్ అకాడమీలోనే రిహాబిలిటేషన్ లో ఉన్న షమీ ఇప్పటి వరకూ మైదానంలో అడుగుపెట్టలేదు. మధ్యలో ప్రాక్టీస్ చేసినా కూడా మ్యాచ్ కు ఫిట్ అయినట్టు కనిపించలేదని తెలుస్తోంది.

మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న షమీకి ఇప్పుడు కొత్తగా పక్కటెముకల గాయమైనట్లు తెలుస్తోంది. దాంతో షమీ రీఎంట్రీ మరింత ఆలసమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ టైమ్‌కి షమీ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మహ్మద్ షమీ ఒకవేళ ఫిట్‌నెస్ సాధిస్తే.. సిరీస్ మధ్యలోనే అక్కడికి పంపాలని బీసీసీఐ ఆశించింది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అనుభవం ఉన్న షమీ టీమ్‌లో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై చివరిగా జరిగిన రెండు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయాల్లోనూ షమీ కీలకపాత్ర పోషించాడు.

మహ్మద్ షమీ ఇప్పటి వరకు 64 టెస్టులు, 101 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లను ఈ క్రమంలో మొత్తం 448 వికెట్లు షమీ పడగొట్టాడు. టీ20ల్లో అంచనాల్ని అందుకోలేకపోయినా వన్డే, టెస్టుల్లో మాత్రం షమీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. భారత్ గడ్డపైనే కాదు.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లపై కూడా షమీకి మంచి రికార్డుంది. అయితే వరుస గాయాలు ఈ 34 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ కెరీర్‌ని దారుణంగా దెబ్బతీస్తోంది. ఇదిలా ఉంటే రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు తొలుత బెంగాల్ సెలెక్టర్లు పేసర్ మహ్మద్ షమీ‌ని ఎంపిక చేశారు. కానీ.. గాయం కారణంగా అతని పేరును తప్పించక తప్పలేదు. దాంతో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మళ్లీ ఆడాలనే షమీ ఆశలకు పూర్తిగా తెరపడింది.