మందుబాబులు..మద్యం దుకాణాలు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అయితే హైదరాబాద్ శివారుల్లో ఉన్న శంషాబాద్ ఏరియా మాత్రం ఎక్సైజ్ శాఖకు ఆదాయపరంగా కిక్ ఎక్కిస్తోంది. రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతాల్లో లేని విధంగా ఇక్కడ మద్యం దుకాణాలకు డిమాండ్ పెరిగిపోయింది. మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం ఎక్సైజ్ విభాగం అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించగానే.. శంషాబాద్ నుంచి కుప్పలు తెప్పలుగా మద్యం షాపుల కోసం అప్లికేషన్స్ వచ్చిపడుతున్నాయి. శంషాబాద్ ఏరియాలో కేవలం 100 షాపులు మాత్రమే ఉన్నాయి.. కానీ శనివారం అర్థరాత్రి వరకు 3 వేలకు పైగా అప్లికేషన్స్ ఎక్సైజ్ శాఖకు అందాయి.
శంషాబాద్‌కు ఎందుకంత క్రేజ్
సాధారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు, ఆదాయం ఎక్కువగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ ఎక్సైజ్ శాఖ కూడా ఊహించని విధంగా ఈసారి మాత్రం పోటీగా శంషాబాద్ ముందు వరసలో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కూడా పక్కకు నెట్టేసి శంషాబాద్ ఏరియా నుంచి మద్యం షాపుల కోసం ఎగబడుతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఖరీదైన ఏరియాలన్నీ శంషాబాద్ పరిధిలోనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఎకరా 100 కోట్ల రూపాయలు పలికిన కోకాపేట ఏరియా కూడా శంషాబాద్ పరిధిలోకే వస్తుంది. స్థానికంగా ఉండేవాళ్లతో పాటు దేశీయ, అంతర్జాతీయ ట్రావెలర్స్ తో శంషాబాద్ నిత్యం బిజీగా ఉంటుంది. లిక్కర్ వినియోగం కూడా అదేస్థాయిలో ఉంటుంది. ఈ ఏరియాలో మద్యం షాపుల లైసెన్స్ దక్కించుకుంటే.. ఇక ఆదాయం ఓ రేంజ్‌లో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపులను 33 జిల్లాల వారీగా విభజించినా.. ఎక్సైజ్ శాఖ మాత్రం శంషాబాద్‌ను స్పెషల్ జోన్‌గా ట్రీట్ చేస్తోంది. శంషాబాద్‌ను హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో కలపకుండా స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న 615 లిక్కర్ అవుట్‌లెట్స్ కంటే శంషాబాద్ ఏరియాలో ఉన్న 100 లిక్కర్ షాపులకే డిమాండ్ ఎక్కువగా ఉందని ఎక్సైజ్ శాఖకు వస్తున్న అప్లికేషన్స్ ను చూస్తే అర్థమవుతుంది.
అప్లికేషన్ల ద్వారా భారీ ఆదాయం
తెలంగాణలో లిక్కర్ ఆదాయం చాలా ఎక్కువ. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి కష్టకాలంలో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఉన్న లైసెన్సులు ముగియడంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది ఎక్సైజ్ శాఖ. అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో టెండర్ల ప్రక్రియను షెడ్యూల్ కంటే ముందే మొదలుపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా రెండేళ్ల కాల వ్యవధితో మద్యం షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. లైసెన్లు అప్లికేషన్ల ద్వారానే ఎక్సైజ్ శాఖకు సుమారు 2 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభా ఆధారంగా లిక్కర్ షాపుల ధరలను ఫిక్స్ చేశారు. సంవత్సరానికి ఇది 50 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 2620 లిక్కర్ షాపులు ఉన్నాయి. లిక్కర్ అమ్మకాల్లో ఆర్డనరీ మద్యానికి 27 శాతం, ప్రీమియం కేటగిరి మద్యానికి 20 శాతం ఆదాయం లైసెన్స్ దక్కించుకున్న వాళ్లకు వస్తుంది. టెండర్ గడువు మరో నాలుగు రోజుల్లో ముగుస్తుండటంతో.. శంషాబాద్ నుంచి మరికొన్ని అప్లికేషన్స్ వస్తాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.