Sharad Pawar: ఇండియా కూటమికి ఫస్ట్‌ షాక్‌

ఇండియా కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మరాఠా నాయకుడు శరద్‌పవార్‌ వ్యవహరిస్తున్న తీరు కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఇంతకీ శరద్‌పవార్‌ ఏం చేశారు..? మిగిలిన పార్టీలు ఎందుకు గుర్రుగా ఉన్నాయి..?

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 12:40 PM IST

ఆగస్టు 1న పుణేలో ప్రధాని నరేంద్రమోడీకి లోకమాన్య తిలక్ అవార్డు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శరద్‌ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం, ప్రధాని మోడీతో వేదిక పంచుకోవడమే ఇప్పుడు ఇండియా కూటమిని కలవరపెడుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే సమావేశానికి వచ్చేందుకు పవార్ అంగీకరించారు. ఆయన్ను ఆ కార్యక్రమానికి దూరంగా ఉంచేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. కూటమిలోని పార్టీల ముఖ్యనేతలు దీనిపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో పవార్‌కు ఫోన్ చేయించాలని భావించారు. ఆ కార్యక్రమానికి హాజరు కావొద్దని దానివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పవార్ మాత్రం ఆ సమావేశానికి హాజరవుతానని స్పష్టంగా చెబుతున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ ఇటీవలే ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ పేర్లలో కూడా ఇండియా ఉందంటూ ప్రతిపక్ష కూటమిపై సెటైర్లు వేశారు. అలాంటి మోడీతో వేదిక ఎలా పంచుకుంటారంటూ పవార్‌ను ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు.

విపక్షాలు ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యాయి. పుణెలో ఓసారి భేటీ జరిగింది. బెంగళూరులో రెండోసారి సమావేశమయ్యాయి. ఆగస్టు 25, 26 తేదీల్లో మరోసారి ముంబయిలో భేటీ కాబోతున్నాయి. వీరందరి ఉమ్మడి శత్రువు బీజేపీనే.. కమలాన్ని గద్దె దించి తమ అస్థిత్వాన్ని నిలుపుకోవాలని ఈ పార్టీలన్నీ భావిస్తున్నాయి. అందుకోసమే వ్యూహాలు పన్నుతున్నాయి. తమందరికి శత్రువైన బీజేపీ, ప్రధాని మోడీని సన్మానించే కార్యక్రమానికి శరద్‌ పవార్ హాజరు కావడమే విపక్ష కూటమికి జీర్ణం కావడం లేదు. అయితే పెద్దాయన ఆలోచన మాత్రం వేరేగా ఉంది. ప్రతిష్ఠాత్మకమైన అవార్డు కార్యక్రమానికి హాజరు కావడంలో తప్పేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

శరద్‌ పవార్‌ పార్టీ ఎన్సీపీ ఇటీవలే అడ్డంగా చీలిపోయింది. అన్న కుమారుడు అజిత్‌ పవార్‌ బీజేపీతో అంటకాగుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కూడా అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన పలుమార్లు శరద్‌పవార్‌ను కలిశారు. దీంతో ఆయన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవార్‌ ఏమైనా పవర్‌ గేమ్‌ ఆడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో శరద్‌పవార్‌ ప్రధాని మోడీతో వేదిక పంచుకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.