ఇక అదే సమయంలో వైసీపీ నుంచి, ఆ పార్టీ అధికారిక చానెల్ నుంచి కొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది. డబ్బుల కోసమే.. వివేకా హత్య జరిగిందని.. రెండో భార్య అంటూ మరో మహిళను తెరమీదకు తీసుకువస్తున్నారు. ఆస్తి కారణంగా.. మిగతా వ్యవహారాల కారణంగానే హత్య జరిగిందని ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో షర్మిల.. ఈ కేసు గురించి రియాక్ట్ అయ్యారు. ఈ దెబ్బతో జగన్‌కు బొప్పి కట్టినట్లు అయింది పరిస్థితి. వివేకా కూతురు సునీతనే కారణం అన్నట్లు అవినాశ్ టార్గెట్ చేస్తున్న వేళ.. షర్మిల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయ్.
సునీతకు నైతికంగా మద్దతుగా నిలుస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు వైసీపీని మరింత కార్నర్ చేస్తున్నాయ్. వివేకా సాధారణ జీవితం గడిపారని.. ఆస్తులన్నీ సునీత పేరు మీద ఎప్పుడో రాసేశారని.. నిజంగా ఆస్తుల కోసం హత్య జరిగితే.. చంపేయాల్సింది సునీతను కానీ వివేకాను కాదు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీని, జగన్‌ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అవినాశ్ రెడ్డికి జగన్ అండగా ఉంటే.. సునీతకు తాను మద్దతుగా నిలుస్తానని తన మాటలతో వైఎస్ కుటుంబం మొత్తానికి చెప్పకనే చెప్పింది షర్మిల. కేసు నుంచి తప్పించుకోవాలని.. ఆ కేసు ప్రభావం పడకుండా ఉండాలని.. నానా ప్రయత్నాలు చేస్తున్న వైసీపీకి.. ఒక్క మాటతో గండికొట్టారు షర్మిల.
ఒకరకంగా కోలుకోలేని దెబ్బ తీశారు. ఏపీలో ప్రత్యర్థి పార్టీకి ఆయుధం అందించారు. నిజానికి వివేకా కేసులో ఏం జరుగబోతోందన్న సంగతి ఎలా ఉన్నా.. అన్నాచెల్లెళ్ల మధ్య అగాధం ఎంతలా పెరిగిందనే దానికి.. ఈ మాటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో పార్టీ ఏర్పాటు వెనక ఒకరకంగా జగన్ మీద కోపమే కారణం అనే చర్చ జరిగింది ఆ మధ్య ! దీనికి తగినట్లు.. జగన్ కుటుంబంతో దూరంగానే ఉంటోంది ఆమె ! ఒకప్పుడు అన్న కోసం నడిచిన షర్మిల.. ఇప్పుడు అదే అన్నను టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడుతోంది.
లోటస్‌పాండ్‌లో షర్మిల వ్యవహారంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తాను, తన తల్లి పోలీసులపై చేయి చేసుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ఇంత జరిగినా.. పార్టీ తరఫున ఇంత జరుగుతున్నా.. వైసీపీ నుంచి కనీసం రియాక్షన్ లేదు. మన అనే పిలుపు వినిపించలేదు. దీంతో షర్మిల కూడా డైరెక్ట్ అయ్యారు. ఆకోపాన్ని ఇలా తీర్చుకున్నారు. జగన్‌ను, అవినాశ్‌ను ఇరుకునపెట్టే వ్యూహం అమల్లో పెట్టారు. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.