అరేయ్ సాంబా రాస్కోరా, సిరీస్ మనదేనన్న గబ్బర్

న్యూజిలాండ్ తో ఓటమి నుంచి తేరుకుంటున్న టీమిండియా ఇక ఆసీస్ టూర్ పై ఫోకస్ పెట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉన్న భారత్ కు ఈ సారి అంత సులభం కాకపోవచ్చు.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 05:30 PM IST

న్యూజిలాండ్ తో ఓటమి నుంచి తేరుకుంటున్న టీమిండియా ఇక ఆసీస్ టూర్ పై ఫోకస్ పెట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉన్న భారత్ కు ఈ సారి అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం భారత జట్టు ఫామ్… అదే సమయంలో ఆస్ట్రేలియా టీమ్ పక్కా ప్లాన్స్ తో సిరీస్ కు రెడీ అవుతుండడమే కారణం. అయితే మాజీ ప్లేయర్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై తమ తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. వీటిలో కొన్ని టీమిండియాకు అనుకూలంగా ఉంటే… మరికొన్ని ఆసీస్ ను ఫేవరెట్ గా చెబుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై స్పందించాడు. ఈ సారి సిరీస్ మనమే గెలుస్తామంటూ జోస్యం చెప్పాడు. కివీస్ పై ఓడినప్పటికీ టీమిండియా ఇప్పటికే ఆసీస్ టూర్ లో ఫేవరెట్ గానే ఉంటుందన్నాడు. వరుసగా 2 టెస్టులు గెలిస్తే చాలు, ఆస్ట్రేలియాకు గెలుపు అవకాశం లేనట్టేనని తేల్చేశాడు. భారత్ గత రెండు పర్యటనల్లో టెస్టు సిరీస్ గెలిచిందనీ, అదే ఊపు, అదే కసితో ఆస్ట్రేలియాలో అడుగుపెడితే సిరీస్ గెలవడం, ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు.

కానీ టీమిండియాకి పాజిటివ్ థింకింగ్, విన్నింగ్ మైండ్ సెట్ ఇప్పుడు చాలా అవసరమని ధావన్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో అపారమైన అనుభవం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా ఈ సిరీస్ లో కీలకం కానున్నారని అంచనా వేశాడు.ఆసీస్ గడ్డపై భారత్ విజయానికి వీరు రాణించడం చాలా అవసరమని చెప్పాడు. అటు గత పర్యటనలో కూడా రహానే, పూజారా అనుభవం వల్లనే టీమిండియా కమ్‌బ్యాక్ ఇవ్వగలిగిందని గుర్తు చేశాడు. కుర్రాళ్లపైనే పూర్తి భారం వేయకుండా సీనియర్లు రాణించి, జూనియర్లలో ఉత్సాహం నింపారన్నాడు. ఇప్పుడు ఆ బాధ్యత విరాట్, రోహిత్‌లపైనే ఉందని ధావన్ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు భారత్ కనీస పోటీ ఇస్తుందా అంటూ ప్రశ్నిస్తున్న ఆసీస్ మాజీ ప్లేయర్స్ గతంలోనూ ఇలాంటి కామెంట్సే చేశారన్నాడు. గత టూర్ సమయంలో భారత్ 36 రన్స్ కే కుప్పకూలిపోయినప్పుడు మన జట్టు కమ్ బ్యాక్ ఇస్తుందని ఎవ్వరూ అనుకోలేదన్నాడు. కోహ్లీ కూడా స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో టీమిండియా 0-4తో ఓడిపోతుందన్నారని, కానీ రహానే కెప్టెన్సీలో సిరీస్ గెలిచిందని గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయ్యాక టీమిండియా, డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన ఐదు టెస్టుల్లో నాలుగు గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతుంది.