నంది లేని శివుడు – ఆ ఆలయ విశిష్టతే వేరు..!

మహాశివుడి అనుంగ భక్తుడు నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో... శివలింగం ముందు కొలువై ఉంటాడు. శివుడిని దర్శించుకోవాలంటే.. ముందుగా నందీశ్వరుడిని దర్శించుకోవాలని చెప్తుంటారు. అలాంటి విశిష్టత ఉన్న నందిని ప్రతిష్టించని... శివాలయం ఎక్కడైనా ఉంటుందా..?

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 01:57 PM IST

మహాశివుడి అనుంగ భక్తుడు నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో… శివలింగం ముందు కొలువై ఉంటాడు. శివుడిని దర్శించుకోవాలంటే.. ముందుగా నందీశ్వరుడిని దర్శించుకోవాలని చెప్తుంటారు. అలాంటి విశిష్టత ఉన్న నందిని ప్రతిష్టించని… శివాలయం ఎక్కడైనా ఉంటుందా..? ఒక్క ఆలయం ఉంది. అక్కడ శివుడి ముందు నంది ఉండదు. అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం.

మన దేశంలో ఏ శివాలయానికి వెళ్లినా… లింగం ఎదురుగా నందిని ప్రతిష్టించి ఉంటారు. నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివుడిని దర్శించుకోవాలి అని చెప్తుంటారు. నంది చెవులలో మన గోత్రం, పేరు, కోరిక చెప్తే… మంచి జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. నందిని దర్శించాకే… శివుడి దర్శనం చేసుకోవాలి. నందికి, శివుడికి మధ్యలో ఎవరూ నిలబడకూడదు. అలా చేస్తే… శివుడి నుంచి నంది దృష్టి మరల్చినట్టే అని… అలా చేయడం మంచిది కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే శివాలయానికి వెళ్లినప్పుడు… నందికి, శివుడికి మధ్య ఎవరూ నిలబడకూడదని ఆలయ పూజారులు చెప్తుంటారు. నంది లేని శివాలయమే ఉండదని అంటారు. కానీ… నంది లేకుండా ఒక శివాలయం ఉంది. అదే కాశీ విశ్వేశ్వర ఆలయం.

మన దేశంలోని శివాలయాలు అన్నింటిలో… కాశీ విశ్వేశ్వర ఆలయం భిన్నంగా ఉంటుంది. ఆ ఆలయం శివలింగం ముందు నంది ఎందుకు ఉండదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రముఖ ఆలయాలు అన్నింటినీ ధ్వంసం చేశాడు. చివరగా కాశీ విశ్వేశ్వర ఆలయంపై దండెత్తాడు. ఆ సమయంలో… ఆలయంలోని పూజారులు… శివలింగాన్ని తీసుకెళ్లి కోనేరులో పడేశారు. ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసిన ఔరంగజేబు సైన్యం… నందీశ్వరుడి విగ్రహాన్ని మాత్రం వదిలేశారు. ఆ నంది విగ్రహం… పాత ఆలయంలో ఇప్పటికీ ఉంది.

కోనేరులో పడేసిన శివలింగం కోసం ఎంత వెతికినా దొరకలేదు. దీంతో… ఆ రూపంలో కొత్త విగ్రహాన్ని తయారు చేయించి… కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. నంది మాత్రం పాత ఆలయంలోనే ఉండిపోయింది. కాశీ విశ్వేరుడిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ.. పాత శివాలయంలోని నందీశ్వరుడిని కూడా దర్శించుకుంటారు. అంతేకాదు… ఆలయం పక్కనే ఉన్న కోనేరులో స్వామివారి విగ్రహం ఉందనే నమ్మకంతో… ఆ కోనేరుకు కూడా పూజలు చేస్తారు. కోనేటిలోని నీటిని మహా తీర్థంగా భావిస్తారు.