IT employees : ఐటీ ఉద్యోగులకు షాక్‌.. రోజు 14గంటలు పనిచేయాల్సిందే..

ఉద్యోగాలు, ఉద్యోగుల విషయంలో కర్ణాటక సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు.. కొత్త వివాదాలకు కారణం అవుతున్నాయ్.

ఉద్యోగాలు, ఉద్యోగుల విషయంలో కర్ణాటక సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు.. కొత్త వివాదాలకు కారణం అవుతున్నాయ్. ప్రైవేటు సంస్థల్లో కర్ణాటక లోకల్‌ జనాలకు.. వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లుతో ఇబ్బందులు పడ్డ అక్కడి కాంగ్రెస్ సర్కార్‌.. ఇప్పుడు ఐటీ ఉద్యోగులతో పెట్టుకుంటోంది. వారి పని గంటలు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. IT, ITES, BPO రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు.. రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. అంటే పది గంటలు వర్క్.. మరో 2 గంటలు ఓవర్ టైమ్ అన్నమాట. ఇలా గరిష్టంగా 14గంటల చొప్పున పనిచేసేలా వీలు కల్పిస్తోంది. ఎక్కువ గంటలతో కలిపి ఎక్కువలో ఎక్కువగా ఇప్పుడు 10గంటలు మాత్రమే పని చేయించుకునే అవకాశం ఉంది. ఐతే వరుసగా మూడునెలల్లో ఉద్యోగితో 125గంటలకు మించి… అదనపు గంటలు పని చేయించుకోకూడదన్నది ఇందులోని అంశం.

ఐటీ ఉద్యోగుల పనిగంటల పెంపు ప్రతిపాదనలు వచ్చాయని.. ఆ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కర్ణాటక సర్కార్ అంటోంది. పనిగంటల పెంపుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెప్తోంది. ఉద్యోగి రోజులో గరిష్ఠంగా ఎన్నిగంటలు పని చేయాలనే దానిపై… కటాఫ్‌ ఏదీ లేదని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. 125గంటల గరిష్ఠ పరిమితితో.. కంపెనీలు ఉద్యోగులతో తమకు కావాల్సిన రోజులు లేదంటే వారాల్లో నిర్దిష్ట పరిమితి మేరకు పనిచేయించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం వారంలో 48గంటలకు మించి పని చేయించకూడదని కార్మిక చట్టాలు చెప్తున్నాయని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గుర్తుచేశారు. పని గంటల పెంపు వల్ల ఉద్యోగులు మరింత మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.