Rythu Bandhu: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రైతు బంధు నిధుల పంపిణీకి రెండు రోజుల క్రితం అనమతి ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు ఆ అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు నిధులకు బ్రేక్ వేసినట్టు తెలిపింది. రైతుల ఖాతాల్లో నిధులు వేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. ఇది గతం నుంచీ కొనసాగుతున్న ప్రభుత్వ పథకం కాబట్టి.. అభ్యంతరం పెట్టవద్దని కోరింది. దాంతో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది.
నవంబర్ 28వ తేదీలోపు రైతులకు నిధులు జమ చేయాలని సూచించింది. అనుమతి ఇచ్చిన మూడు రోజులైనా.. ఈ మూడు రోజులు బ్యాంకులకు శెలవులు ఉన్నాయి. దాంతో ఈనెల 28న మంగళవారం నాడు ఒకే రోజు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 7 వేల కోట్ల రూపాయలు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కూడా కోరింది. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు మంగళవారం నాడు నిధుల జమ చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇప్పుడు నిధులు విడుదల చేయడం అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది ఈసీ. ఈ ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది.
నిధుల విడుదలకు అనుమతి వెనక్కి తీసుకోవడం వెనుక రెండు కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. పార్టీల నుంచి అభ్యంతరాలు వచ్చిఉండవచ్చు. దీనికి తోడు ఓ బహిరంగ సభలో ఆర్థిశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన ప్రకటన కూడా వివాదస్పదమైంది. “మీరు సోమవారం ఉదయం టీ తాగే సమయానికి టింగ్.. టింగ్.. టింగ్ మంటూ రైతుల ఫోన్లకు రైతు బంధు నిధులు జమ అయినట్టుగా మెసేజ్‌లు వస్తాయని అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా సోమవారం నాడు బ్యాంకులకు సెలవు ఉంది. హరీష్ ప్రకటన కూడా ఓటర్లను ఆకట్టుకునేలా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈసీ తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.
మొదట రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ ఇచ్చిన ఆదేశాలకు కాంగ్రెస్ పార్టీ మిశ్రమంగా స్పందించింది. ఫండ్స్ రిలీజ్ ను వ్యతిరేకించనప్పటికీ.. తాము అధికారంలోకి వస్తే నిధులు పెంచేవారమనీ, కౌలు రైతులకు కూడా ప్రయోజనం ఉండేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖలో తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు నిధుల విడుదలను హడావిడిగా ఈసీ అనుమతించడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేందుకే ఈసీతో బీజేపీ ఈ ఆదేశాలు జారీచేయించందని విమర్శించారు. ప్రతిపక్షాల ఆరోపణలు, హరీష్ రావు బహిరంగ సభల్లో చెప్పుకోవడం .. లాంటి పరిణామాలతో రైతుబంధుకు బ్రేక్ పడింది.
ఈ రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో రైతుబంధు నిలిపివేత మరోసారి బీఆర్ఎస్ అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ఆపి వేయించిందని ప్రచారం చేసే ఛాన్సుంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.