ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ రాజకీయ, పర్యాటక మంత్రి, సాఃొ
అధికారంలో ఉంటే మంత్రులు, రాజకీయ నేతల ఆస్తులు పెరుగుతాయా ? ఆ మాట లీడర్లను అడిగితే…అస్సలు ఒప్పుకోరు. కానీ ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు చూపించి దొరికిపోతే… ఉన్న పదవి ఊడిపోతుంది. అందుకే అందులోనే ఈ లీడర్ల అసలు చిట్టా బయటపడుతుంది. ఏపీలో పర్యాటక మంత్రిగా, నగరి ఎమ్మెల్సీగా ఉన్న రోజా ఆస్తులు 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 47 శాతం పెరిగాయి. అమాంతం పెరిగిన మంత్రి రోజా స్థిర, చర ఆస్తులు చూసి జనం నోరెళ్ళబెడుతున్నారు.
మంత్రి రోజా నగరి ఎమ్మెల్యే నామినేషన్ తో పాటు ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులేంటో బయటపెట్టారు. ఐదేళ్లలో ఆమె అసెట్స్ 47శాతం పెరిగాయి. 2019లో రోజాకి 9 కోట్ల 30 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు 13 కోట్ల 70 లక్షలకు పెరిగాయి. ఇందులో కోటి రూపాయల విలువైన బెంజ్‌తో పాటు మరో 9 కార్లు ఉన్నాయి. అఫిడవిట్ లో కార్లు, బంగారం విలువ 4 కోట్ల 58 లక్షలుగా చూపించారు రోజా. ఆమెకు 67 లక్షల విలువైన 986 గ్రాముల బంగారం ఉంది. ఇవి కాకుండా మార్గదర్శి, ధనలక్ష్మి శ్రీనివాసన్ చిట్‌ఫండ్స్ లో 60 లక్షలకు పైగా చిట్స్ ఉన్నాయి. 2019 కి ముందు సాధారణ కార్లు ఐదింటిని అఫిడవిట్ తో చూపించారు మంత్రి రోజా. అప్పట్లో వాటి విలువ 38 లక్షల రూపాయలు మాత్రమే. కానీ అధికారంలోకి వచ్చాక ఖరీదైన వాహనాలను కొన్నారు. 2019 లో రూ.3 లక్షల 80 వేల విలువైన ఇసుజు డీమాక్స్ కారు ఉంది. 2020లో 17 లక్షల 80 వేల విలువైన ఫోర్డ్ ఎన్డీవర్ కారు, 2022లో కోటి విలువైన బెంజ్ కారు కొన్నారు. పదవీ కాలంలోనే మంత్రి రోజా చరాస్థులు భారీగా పెరిగాయంటున్నారు.
చరాస్తులే కాదు… వ్యవసాయ భూములతో పాటు, ఇళ్ల స్థలాలను కూడా కొన్నారు మంత్రి రోజా. చెన్నై, హైదరాబాద్, నగరి పరిసర ప్రాంతాల్లో తనతో పాటు, భర్త సెల్వమణి, పిల్లల పేర్లతో ఆస్తులు కొన్నారు. నగరి మండలం కీలపట్టు లో రెండుసార్లు ఎకరా చొప్పున భూమి కొన్నారు మంత్రి రోజా. విజయపురం మండలంలో 14 లక్షల 23 వేలతో భూమిని కొన్నారు. నగరి మండలం వీరకావేరి రాజపురంలో 3.40 ఎకరాలను 15 లక్షల 50వేలతో కొన్నారు. భర్త సెల్వమణి పేరుతో తమిళనాడు కాంచీపురం జిల్లా పాలవేరి, తిరు ముకదల్ ప్రాంతాల్లో 2.89 ఎకరాల వ్యవసాయ భూమి రోజా కొనుగోలు చేశారు.
తెలంగాణతోపాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ ఇళ్లు, ఇళ్ల స్థలాలను మంత్రి రోజా కొన్నారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో 450 చదరపు అడుగుల ఇళ్ల స్థలం ఉంది. పుత్తూరు దగ్గర్లో 3 వేల 750 చదరపు అడుగుల భూమిని కొన్నారు. భర్త సెల్వమణి పేరుతో నగరి పరిసర ప్రాంతాల్లో 7 వేల 580 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలను మంత్రి రోజా కొనుగోలు చేశారు. ఇవి కాకుండా కూతురు, కొడుకు పేరు మీద కూడా రోజా ఆస్తులు కొన్నారు. ఐదేళ్ళల్లో దాదాపు 50శాతం పెరిగిన మంత్రి రోజా ఆస్తులను చూసిన జనం నోరేళ్ళబెడుతున్నారు.