తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి 100 రోజులకు పైగానే అయిపొయింది. రాష్ట్రంలో రెండు దఫాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొదటి సారి ఓటమి చెందడంతో.. ఆ పార్టీ నేతలందరూ పక్క పార్టీ వైపు వలసలు వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. చాలా రోజుల నుంచి అసంతృప్తిలో ఉన్న నేతలే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్టీలో సముచిత స్థానం ఇచ్చిన కేకే, కడియం శ్రీహరి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ కూడా పార్టీ విడడంతో బీఆర్ఎస్ నేతలు అయోమయంలో పడ్డారు.
ఇప్పుడు కూడా బీఆర్ఎస్ మరో కీలక నేత పార్టీని వీడారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను విడుదల చేశారు. అనంతరం ఆ లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. తాజా సమాచారం మేరకు భేతి సుభాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో మాజీ మంత్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు భేతి సుభాష్ రెడ్డి మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికు కాకుండా మరో వ్యక్తికి ఇచ్చారు కేసీఆర్. దీంతో అప్పటి నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగానే ఉంటున్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి… ఇవాళ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.
SSM