కెనడా టెర్రర్ హబ్ గా మారింది. ఆ దేశాన్ని అడ్డాగా చేసుకొని ఖలిస్థానీ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం నిరసనలు తెలుపుతున్నాయి. భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు వేదికగా ఈవిషయాలను భారత సర్కారు లేవనెత్తగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తోసిపుచ్చారు. కెనడాకు వెళ్లిన తర్వాత ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత్ పైనే విషం కక్కారు. కెనడాలో ఇటీవల జరిగిన ఒక ఖలిస్థాన్ ఉగ్రవాది (హరదీప్ సింగ్ నిజ్జర్) మర్డర్ కేసులో భారత సర్కారు హస్తం ఉందనే తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్నిబట్టి కెనడా సర్కారుకు ఖలిస్థానీ ఉగ్రసంస్థతో అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఖలిస్థాన్ సపోర్టింగ్ భావజాలం కలిగిన ఓటర్లు కెనడాలో పెద్దసంఖ్యలో ఉండటం.. వారంతా తమ పార్టీకి మద్దతు ఇస్తుండటంతో జస్టిన్ ట్రూడో వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. కెనడాలో న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) పగ్గాలను సిక్కు నాయకుడైన జగ్మిత్ సింగ్ ధాలివాల్ 2017లో చేపట్టారు. ఆ తర్వాత ఆయన ఖలిస్తాన్ వేర్పాటువాదులకు తన మద్దతును అందజేస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలో కెనడాను స్థావరంగా మార్చుకొని పంజాబ్ లో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రమూకల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
పాక్ ఐఎస్ఐ నుంచి ఆర్డర్స్..
కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్థానీ ఉగ్రమూకల లిస్టులో అర్ష్‌దీప్ సింగ్ డల్లా, లఖ్‌బీర్ సింగ్ లాండా, గోల్డీ బ్రార్, గురుపత్వంత్ సింగ్ పన్నూ, పరమజీత్ పమ్మా, అవతార్ సింగ్ ఖాండా వంటి వాళ్లు ఉన్నారు. వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నుంచి నిధులు అందుతున్నాయని సమాచారం. కెనడాలో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ లాండాకు పాక్ ఐఎస్ఐ నుంచి ఆర్డర్స్ అందుతున్నాయని, వాటి ప్రకారమే అతడు పనిచేస్తున్నాడని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ లో ఉన్న తన మనుషుల ద్వారా లఖ్‌బీర్ సింగ్ లాండా టెర్రర్ యాక్టివిటీస్ నడిపిస్తున్నాడని అంటున్నాయి. ఇటీవలకాలంలో పంజాబ్ లోని మొహాలీ, తరన్ తరణ్‌లలో జరిగిన ఉగ్రదాడులకు అతడే సూత్రధారి అని భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. 2017లో కెనడాకు పరారీ అయిన లఖ్‌బీర్ సింగ్ లాండా తలపై రూ.15 లక్షల రివార్డును భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించింది. పంజాబ్‌లో జరుగుతున్న పలు సుపారీ మర్డర్స్, గ్యాంగ్ వార్స్, లూటీలు, ప్రభుత్వ సంస్థలపై దాడులలో కెనడాను అడ్డాగా చేసుకున్న ఖలిస్థాన్ టెర్రరిస్టుల హస్తం ఉందని ఇంటెలీజెన్స్ ఇన్ పుట్స్ అందుతున్నాయి. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యలోనూ ఆ ఉగ్ర పిశాచాల హస్తమే ఉందని ఆరోపిస్తున్నాయి.
గోల్డీ బ్రార్.. 600 మంది టెర్రరిస్టులు
సిద్దూ మూసేవాలాను హత్య చేసింది తామేనని బహిరంగంగా ప్రకటించుకున్న గోల్డీ బ్రార్, 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడు గ్యాంగ్ స్టర్ అర్షదీప్ సింగ్ సహా పలువురు నేరస్థులను అప్పగించాలంటూ భారత ప్రభుత్వ అధికారులు కెనడాకు విజ్ఞప్తి చేశారు. అయినా కెనడా సర్కారు పట్టించుకోలేదు. సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ కెనడా నుంచి అమెరికాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ లు ఏర్పాటు చేసిన గ్యాంగ్ లో దాదాపు 600 మంది టెర్రరిస్టులు సభ్యులుగా ఉన్నట్లు మీడయాలో కథనాలు వస్తున్నాయి. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నాయని ఆ కథనాల్లో ప్రస్తావిస్తున్నారు. భారత్ లో పలు నేరాలకు పాల్పడి వాంటెడ్ లిస్టులో ఉన్న గుర్వంత్ సింగ్ బాత్, భగత్ సింగ్ బ్రార్, మోనిందర్ సింగ్ బువాల్, సతీందర్ పాల్ సింగ్ గిల్ తదితరులను అప్పగించేందుకూ కెనడా నో చెబుతోంది. అర్ష్‌దీప్ దల్లా సన్నిహితుడు సుఖ దూనీ కూడా ఐఎస్‌ఐ, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల ఒడిలో కూర్చుని దేశంపై కుట్రలు పన్నుతున్నాడు. తాజాగా ఎన్ఐఏ కూడా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి సుఖ దూనిపై రివార్డు ప్రకటించింది.
ఇందిరాగాంధీ హత్య తర్వాత..
కెనడాలోనే కాకుండా బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లోనూ ఖలిస్థానీ ఉగ్ర మూకలు చెలరేగిపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులను రాడ్లతో చితకబాదాయి. బ్రిటన్ లో భారతీయ జాతీయ జెండాను ధ్వంసం చేశారు. ఇలా పలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. భారత కార్యాలయాలు, హిందూ ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్లీ ఖలిస్థాన్ ఏర్పాటువాదులు పేట్రేగుతున్నారు. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఖలిస్తాన్ వేర్పాటు వాదులకి సాయం అందిస్తున్నాయని అంటున్నారు.