ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం ఈ సారి విదేశాల్లో జరగడం ఖాయమైంది. ఇప్పటికే దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్ లను వేదికలుగా పరిశీలిస్తున్న వేళ మరో ఆసక్తికర వార్త బయటకొచ్చింది. మెగావేలాన్ని సింగపూర్ లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. అరబ్ దేశాలతో పోలిస్తే ఖర్చు కాస్త తక్కువగా ఉండడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ విడుదలైన తర్వాత వేలానికి ఆతిథ్యమిచ్చే దేశాల రేసులో సౌదీ అరేబియా పేరు ఎక్కువగా వినిపించింది. అయితే అక్కడ నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. బీసీసీఐ పెద్దలు, 10 ఫ్రాంచైజీల ప్రతినిధులతో పాటు బ్రాడ్ కాస్టింగ్ చేసే స్టార్, జియో ప్రతినిధులకూ అక్కడే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు నిర్వహణ వ్యయం కనిపిస్తుండడంతో వేదికను మార్చేందుకే బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
దీని ప్రకారం గతంలో వేలాన్ని నిర్వహించిన దుబాయ్ లో కంటే సింగపూర్ ను వేదికగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ కు ఇప్పటికే క్రికెట్ దేశాల్లో మంచి క్రేజ్ ఉండగా… క్రికెటేతర దేశాల్లోనూ ఈ రిచ్చెస్ట్ లీగ్ కు ఫాలోయింగ్ పెంచే ఉద్దేశంతోనే వేలాన్ని విదేశాల్లో నిర్వహిస్తున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. అంతకుముందు లండన్ ను కూడా పరిశీలించినప్పటకీ అక్కడి చల్లటి వాతావరణం అనుకూలంగా ఉండదన్న కారణంతో ఆలోచనను విరమించుకున్నారు. దీంతో వేలానికి ఆతిథ్యమిచ్చే రేసులో ప్రస్తుతం సింగపూర్ ముందున్నట్టు సమాచారం. నవంబర్ చివరివారంలో ఐపీఎల్ మెగావేలం జరగనుండగా.. తేదీలు ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై కసరత్తు చేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి ఆరుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే వీలు కల్పించారు. దీంతో పలువురు స్టార్ క్రికెటర్లు తమ పాత ఫ్రాంచైజీలతోనే కొనసాగనున్నారు. అయితే పలువురు యువ క్రికెటర్లు ఈ సారి వేలంలో జాక్ పాట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఫ్రాంచైజీల మనీ పర్స్ కూడా 120 కోట్ల వరకూ పెంచడం కూడా జోష్ నింపింది. అయితే రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ కోసం వెచ్చించే మొత్తం 75 కోట్ల వరకూ ఉండడంపై ఫ్రాంచైజీలు అభ్యంతరం చెబుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐని క్లారిటీ అడిగినట్టు వార్తలు వస్తున్నాయి.