Palvai Harish Babu: ఇది వేసవి కాలం కాదు.. వలసల కాలం అనే జోకులు పేలుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు చూస్తుంటే ! ఏపీలో వైసీపీ నుంచి టీడీపీకి జంపింగ్ జపాంగ్‌లు పెరుగుతుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా.. రండి రారండి అంటూ గాంధీభవన్ గేట్లు ఓపెన్ చేసి పెట్టింది హస్తం పార్టీ. బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతల్లో చాలామంది.. ఇప్పటికే కాంగ్రెస్ బాట పట్టగా.. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందా అనే చర్చ జరుగుతోంది.
MALLAREDDY: మల్లారెడ్డి బీజేపీలోకి జంప్ ! ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వాలని కండిషన్
సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు.. సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈయన ఒక్కరు కలిస్తే ఇంత అనుమానం ఉండకపోయేది. GHMC బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా హరీష్‌తో పాటు సీఎం రేవంత్‌ను కలిశారు. దీంతో వీళ్లు త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ మొదలుపెట్టిన విజయసంకల్ప యాత్ర.. ప్రస్తుతం ఆదిలాబాద్‌లోనే నడుస్తోంది. రెండు రోజులుగా ఈ కార్యక్రమానికి హరీష్ దూరంగా ఉంటున్నారు. అలాంటిది ఇప్పుడు వెళ్లి సీఎంను కలవడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు మీద ఫిర్యాదు చేసేందుకే రేవంత్‌ను కలిశారనే టాక్ వినిపిస్తున్నా.. అసలు విషయం అది కాదు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక అటు రేవంత్‌ను కలిసిన తర్వాత.. ఏం చర్చించారనే దానిపై ఎమ్మెల్యే హరీష్‌బాబు మీడియాకు చెప్పకుండా తప్పించుకున్నారు.
ఇది మరిన్ని అనుమానాలకు కారణం అవుతోంది. నిజంగా అభివృద్ధి పనులపై వెళ్లారా.. ఇంకేమైనా చర్చించారా అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. రేవంత్‌ను ప్రత్యేకంగా కలిసిన నేతలంతా.. ఆ నెక్ట్స్ డే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇప్పటివరకు ! ఇప్పుడు హరీష్ నిర్ణయం కూడా అలానే ఉండబోతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ తరఫున 8మంది ఎమ్మెల్యేలు.. అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో హరీష్ బాబు.. రేవంత్‌ను కలవడంతో.. ఏం జరగబోతుందనే ఆసక్తి రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.