వెస్టిండీస్‌తో సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20లో 30వ సారి 50 ప్లస్ స్కోర్ చేసిన తొలి మహిళా క్రీడాకారిణిగా మంధాన నిలిచింది. దీంతో మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ పేరిట ఉండేది. గతవారమే ఆమె ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచిన స్మృతి మంధాన ఇప్పుడు హాఫ్ సెంచరీతో మరో వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది.
స్మృతి మంధాన కంటే ముందు 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ వరుసగా మూడు అర్ధశతకాలు బాదాడు. అయితే ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో మంధాన 47 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 77 పరుగులు చేసింది. దీంతో అనేక రికార్డులు ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళగా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఆమె మూడు మ్యాచ్‌ల్లో 64.33 సగటుతో 193 పరుగులు చేసింది. 2018 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై 192 పరుగులు చేసిన మిథాలీ రాజ్ రికార్డును మంధాన బద్దలు కొట్టింది.
మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఈ సంవత్సరం 23 మ్యాచ్‌ల్లో మంధాన 42.38 సగటుతో 763 పరుగులు చేసింది. ఇందులో ఆమె అత్యధిక స్కోరు 77. స్మృతి మంధాన ఒక క్యాలెండర్ ఇయర్‌లో మహిళల టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్ చేసిన రికార్డును సృష్టించింది. మంధాన టీ20ల్లో 8 సార్లు హాఫ్ సెంచరీలు చేసింది. 2018లో 7 సార్లు 50 ప్లస్ స్కోర్‌లు సాధించిన మిథాలీ రాజ్‌ను వెనక్కి నెట్టివేసింది. అంతేకాదు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌గా స్మృతి మంధాన నిలిచింది. మంధాన ఇప్పటి వరకు 104 ఫోర్లు కొట్టింది. గతేడాది 14 మ్యాచుల్లో 99 ఫోర్లు కొట్టిన హేలీ మాథ్యూస్‌ను ఆమె అధిగమించింది