IAS vs IPS: రూప Vs రోహిణి.. కర్నాటకలో సివిల్ సర్వెంట్ల సోషల్ వార్

రోహిణి సింధూరి-డి.రూప మౌద్గిల్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ.. లోపాలను బయటపెట్టుకుంటోన్ననేపథ్యంలో.. అసలే ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమించింది.

  • Written By:
  • Updated On - February 21, 2023 / 04:29 PM IST

విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని గుర్తింపు పొందిన కర్ణాటక కేడర్‌కు చెందిన తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై మరోసారి బదిలీ వేటు పడింది. ఇదివరకు మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో తోటి ఐఎఎస్ అధికారిణి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ శిల్పా నాగ్‌తో వివాదం గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఐపీఎస్ అధికారిణి డి.రూప ముద్గిల్ తో వివాదం ముదిరింది. ఇద్దరిపైనా బదిలీ వేటు పడింది.

2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్‌కు చెందిన రోహిణి సింధూరి తెలుగు అధికారిణి. మొదట్లో తుమకూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, మండ్య జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు. అనంతరం హసన్, మైసూరు జిల్లాల కలెక్టర్‌గా ఉన్నారు. మైసూరులో ఉన్నప్పుడే వివాదాలు చుట్టుముట్టాయి. 2017లో ఆమె హసన్ జిల్లా కలెక్టర్‌గా నియమితులు అయ్యారు. 2018న ఆమెను కేఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, 2019లో సిల్క్ బోర్డ్ కమిషనర్‌‌గా బదిలీ అయ్యారు.

2020లో మైసూరు జిల్లా కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఎక్కువ రోజులు అక్కడ కొనసాగలేకపోయారు. శిల్పా నాగ్ తో తలెత్తిన వివాదం నేపథ్యంలో 2021లో బదిలీని ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా స్థాన చలనం ఏర్పడిందామెకు. ఐపీఎస్ అధికారిణి డీ రూపతో వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రోహిణి సింధూరిపై బదిలీ వేటు వేసింది. పోస్టింగ్ ఇవ్వలేదు.

ఐపీఎస్ అధికారిణి డీ రూపను కూడా కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది. కర్ణాటక రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న డి.రూపను ఆ హోదా నుంచి తప్పించింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో డి.రూప భర్త, ఐఎఎస్ అధికారి మునీశ్ మౌద్గిల్ ను కూడా బదిలీ చేసింది బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం. సర్వే సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా ఉన్నమునీశ్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కు పంపించింది.

మొత్తంగా అయిదుమంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కర్ణాటక డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండర్ సెక్రెటరీ జేమ్స్ తారకన్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శ్రీవత్స కృష్ణ బదిలీ అయ్యారు. ఈ స్థానంలో మునీశ్ మౌద్గిల్ నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న రోహిణి సింధూరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ స్థానంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్‌ప్రెన్యుర్ షిప్ అండ్ లైవ్లీ హుడ్ సంయుక్త కార్యదర్శి హెచ్ బసవరాజేంద్రను నియమించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అదనను డైరెక్టర్ సీఎన్ శ్రీధరను అదే శాఖ కమిషనర్ బదిలీ చేసింది.

హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న డీ రూపను బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న డీ భారతిని నియమించింది. వెయిటింగ్ లో ఉన్న మరో ఐఎఎస్ అధికారి హెచ్ వీ దర్శన్ ను తుమకూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న యోగానంద్ ను బదిలీ చేసింది.

రోహిణి సింధూరి-డి.రూప మౌద్గిల్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ.. లోపాలను బయటపెట్టుకుంటోన్ననేపథ్యంలో.. అసలే ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమించింది. ఇద్దరినీ బదిలీ వేటు వేసింది. డి.రూప తనపై చేసిన ఆరోపణలను రోహిణి సింధూరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ దృష్టికి తీసుకెళ్లిన మరుసటి రోజే ఆ బదిలీలు జరిగాయి.