అమ్ముడైంది రూ.27 కోట్లు, చేతికి వచ్చేది రూ.18.9 కోట్లే

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ ఓ అద్భుతమనే చెప్పాలి... ఎంతో టాలెంట్ తో జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆసీస్ గడ్డపై గబ్బాలో అతను ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే.. అయితే దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకూ వెళ్ళాడు.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 02:38 PM IST

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ ఓ అద్భుతమనే చెప్పాలి… ఎంతో టాలెంట్ తో జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆసీస్ గడ్డపై గబ్బాలో అతను ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే.. అయితే దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకూ వెళ్ళాడు. ఇక్కడ నుంచి అతను కోలుకుని రీఎంట్రీ ఇవ్వడం ఒక వండర్ గా నిలిచిపోయింది. టెస్టు, వన్డేలు, టీ20లో పంత్‌ 2.0 లాగా కనిపిస్తున్నాడు. ఇటీవల మెగావేలంలో రికార్డు ధర పలికి చరిత్ర సృష్టించాడు. పంత్ వేలంలోకి రాగానే అందరూ కేకలు వేశారు. మొదట లక్నో, ఆర్‌సీబీ జట్లు పోటాపోటీగా బిడ్‌ వేశాయి. వెంటవెంటనే ధర పెరుగుతూ వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ మధ్యలో వచ్చి వెళ్లిపోగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ వెనక్కి తగ్గలేదు. చివరకు 20.75 కోట్లకు లక్నో వేలంలో దక్కించుకుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ను మళ్లీ తీసుకునేందుకు ఆర్‌టీఏం కార్డు ఉపయోగించింది. అయితే లక్నో మాత్రం 27 కోట్లకు ఫైనల్ బిడ్ వేయడం, ఢిల్లీ చేతులెత్తేయడంతో ఎల్ఎస్ జీ ఫ్రాంచైజీకి సొంతమయ్యాడు.

ఈ విధంగా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను అధిగమించాడు. అయితే పంత్ భారీ మొత్తానికి అమ్ముడైనా అతని చేతికి మాత్రం 27 కోట్లు రాదు. 27 కోట్లలో పంత్ కు దక్కేది కేవలం 18 కోట్లు మాత్రమే. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో 30% పన్నుగా చెల్లించాలి. దీంతో పంత్ కు ఫ్రాంచైజీ ఇచ్చే 27 కోట్లలో 30% అతను పన్నుగా చెల్లించాల్సిందే. దీని ప్రకారం చూస్తే ప్రతి సీజన్‌కు 18.9 కోట్ల వేతనం మాత్రమే పంత్ అందుకుంటాడు. అంటే కాంట్రాక్ట్ విలువ 27 కోట్లు అయితే 8.1 కోట్లు పన్ను రూపంలో పోతుంది. దీంతో పంత్ చేతికి 18.9 కోట్లు మాత్రమే అందుతాయి. ఐపీఎల్ లో ఏ భారత ప్లేయర్ కైనా ఇదే రూల్ వర్తిస్తుంది. దీంతో ఐపీఎల్ ద్వారా కేంద్రప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తుంటుంది. అటు బీసీసీఐ కూడా ట్యాక్స్ రూపంలో పెద్దమొత్తాన్నే చెల్లిస్తోంది.