Odisha Train Accident: విషాదంలో వికృత చేష్టలు.. వీళ్లు అసలు మనుషులేనా..

ఒడిశా కోరమాండల్‌ ట్రైన్‌ యాక్సిడెంట్‌.. భారత రైల్వే చరిత్రలో మాసిపోని ఓ రక్తపు మరక. వందల కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ ఘటన చరిత్రలో ఓ బ్లాక్‌ డే. ఇంతటి విషాద సమయంలో కూడా చేతివాటం చూపించారు కొందరు నీచులు.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 03:01 PM IST

రైల్వేట్రాక్‌ మీద పడి ఉన్న బాధితుల వస్తువులను దొంగిలించారు. ప్రమాదంలో చాలా మంది వస్తువులు, బట్టలు, పర్స్‌లు, సెల్‌ఫోన్లు ట్రాక్‌ మీదే పడిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బోగీలను పక్కను నెట్టగానే చాలా మంది స్థానికులు పట్టాపై ఉన్న వస్తువులను తీసుకున్నారు. పర్సుల్లో డబ్బులు తీసుకుని పర్సులు పడేశారు. చాలా మంది బట్టల బ్యాగులు, ఖరీదైన వస్తువులు ఎత్తుకెళ్లారు. అవి ఎవరివో కావొచ్చు.

కొందరి మృతదేహాలను గుర్తించేందుకు అవే ఆధారం కావొచ్చు. అలాంటి వస్తువులను ఏమాత్రం బాధ్యత లేకుండా దొంగిలించారు కొందరు నీచులు. ఓ పక్క రెస్క్యూ సిబ్బంది పరిస్థితిని యధాస్థితికి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. మరోపక్క బాధితులు తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను వెతుక్కుంటు ఏడుస్తున్నారు. కానీ ఈ మూర్ఖులు మాత్రం చేతికందింది దోచుకునేందుకు ప్రమాద స్థలిలో వేట కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుల బాధను కూడా పట్టించుకోకుండా తమ జేబులు నింపుకున్నారు. శవం మీద పేలాలు ఏరుకునేలాంటి ఈ చర్యపై ప్రతీ ఒక్కరూ మండిపడుతున్నారు.