BRS Party: బీఆర్ఎస్ టికెట్ దొరకక.. దుబాయ్ టికెట్ తీసుకున్నారు ?!

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నాయకులు ఇప్పుడు దుబాయ్ బాట పట్టారు.

  • Written By:
  • Publish Date - September 2, 2023 / 06:10 PM IST

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నాయకులు ఇప్పుడు దుబాయ్ బాట పట్టారు. కుమారుడు హిమాన్షును అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించ‌డానికి మంత్రి కేటీఆర్ గ‌త నెల చివ‌ర‌లో అమెరికా వెళ్లారు. ఆయన హైదరాబాద్ కు తిరిగొస్తారని ఎదురుచూసి చూసి.. రాక ఇంకా ఆలస్యమవుతుండటంతో విమానం ఎక్కి నేరుగా దుబాయ్ లో ల్యాండ్ కావాలని పలువురు నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 6న అమెరికా నుంచి హైదరాబాద్ కు కేటీఆర్ చేరుకోనున్నారు. అయితే మార్గం మ‌ధ్య‌లో దుబాయ్ లో 12 గంట‌ల‌ పాటు ఆయన ఆగుతారు. ఇక్క‌డికి వ‌చ్చాక కేటీఆర్ అపాయింట్‌మెంట్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న కొంద‌రు ఆశావ‌హులు.. నేరుగా దుబాయ్ కి వెళ్లి అక్క‌డే కలిసేందుకు రెడీ అయ్యారు.

ఇలా దుబాయ్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న లీడర్ల జాబితాలో బొంతు రామ్మోహ‌న్‌, నీలం మ‌ధు తదితరులు ఉన్నారని తెలుస్తోంది. కేటీఆర్ కు స్నేహితుడైన జాన్సన్ నాయక్‌కు ఖానాపూర్ టికెట్ మినహా మిగతా లీడర్లకు టికెట్ల కేటాయింపులో నిరాశే ఎదురైంది. దీంతో కేటీఆర్ అనుచరులుగా పేరు పొందిన గజ్జెల నగేష్, క్రిశాంక్, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, వెన్‌రెడ్డి రాజు, బండి రమేశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి భంగపాటుకు గురయ్యారు. వీరంతా కేటీఆర్ రాగానే.. ఆయనతో భేటీ కావాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఇవాళ (సెప్టెంబరు 2న) కేటీఆర్ వస్తారని భావించినప్పటికీ ఇంకా రాలేదు. సాంకేతిక కార‌ణాల‌తో కేటీఆర్ రాక 6వ తేదీకి వాయిదా ప‌డింది. దీంతో టికెట్ దక్కక నిరాశకు గురైన లీడర్లు ఆయనను కలిసేందుకు దుబాయ్ కు వెళ్తున్నారు.

కేటీఆర్ సన్నిహితులకు మొండిచెయ్యి ?

కేటీఆర్‌కు స‌న్నిహితంగా మెలుగుతార‌ని పేరున్న జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఉప్ప‌ల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కుత్బుల్లాపూర్ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ప‌ఠాన్‌చెరు టికెట్ కావాలంటున్న నీలం మ‌ధు, జ‌న‌గామ కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డికి మొండిచెయ్యే మిగిలింది. కేటీఆర్‌తో చెప్పించుకుంటే తమకు టికెట్ దక్కే ఛాన్స్ ఉంటుందని వీరంతా భావిస్తున్నారు. వీరిలో పలువురు లీడర్లు ఇప్పటికే కేటీఆర్ కు ఫోన్ చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఇంకొందరు తమకు జరిగిన అన్యాయంపై టెక్స్ట్, వాయిస్ మెసెజ్‌ లను పంపారు. కేటీఆర్ తనకు ఫోన్ చేసిన లీడర్లను బుజ్జగిస్తున్నట్టు తెలిసింది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, తను హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను మాట్లాడుకుందామని భరోసా ఇస్తున్నట్లు సమాచారం. అయితే కొందరు లీడర్లు ఆయన మాటలను నమ్ముతుండగా, ఇంకొందరు మరోసారి మోసపోతామేమోనని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్లాన్ ప్రకారమే యూఎస్ టూర్

ఈనెల 21న అభ్యర్థుల ప్రకటన, అంతకు రెండు రోజుల ముందు కేటీఆర్ అమెరికా టూర్ షెడ్యూల్ ఓ ప్లాన్ ప్రకారమే ఖరారైనట్టు పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తలెత్తే పరిణామాలను ముందుగానే అంచనా వేసుకున్న కేటీఆర్ ఈ నెల చివర వరకు అమెరికాలో గడిపేందుకు షెడ్యూల్ రూపొందించున్నారు. కొడుకును అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు యూఎస్‌కు వెళ్లిన కేటీఆర్ ఆ పనులు పూర్తయిన వెంటనే హైదరాబాద్‌కు రావొచ్చు. కానీ అందుబాటులో ఉంటే టికెట్లు దక్కని లీడర్ల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందని, ఒకవేళ వారిని కలిస్తే ఏం చెప్పాలో, ఎలా బుజ్జగించాలో తెలియకనే ఆయన యూఎస్‌లో ఉండిపోయారనే చర్చ జరుగుతున్నది.