ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా మంది యువ ఆటగాళ్ల లైఫ్ ను మార్చేసింది. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. అదే సమయంలో వారి ఫైనాన్షియల్ స్టేటస్ ను కూడా మార్చింది. ఇటీవల ముగిసిన వేలంలోనూ పలువురు యువ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు. వారిలో మహారాష్ట్ర క్రికెటర్ శుభమ్ దూబే గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. వేలంలో రాజస్థాన్ రాయల్స్ శుభమ్ దూబేను 5.8 కోట్లకు కొనుగోలు చేసింది.
దూబేది దిగువ మధ్యతరగతి కుటుంబం. అతని తండ్రి నాగ్ పూర్ లో పాన్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నప్పట్నుంచి క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న శుభమ్ తండ్రి ప్రోత్సాహంతో దానినే కెరీర్ గా ఎంచుకుని రాణించాడు. 29 ఏళ్ల దూబే స్థానికంగా పలు టోర్నీలు ఆడినప్పటికీ.. రెండేళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టడంతో ఐపీఎల్ లో వేలంలో ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. బంతిని బాదడంలో తనదైన నైపుణ్యం సాధించిన దూబే.. ఫినిషర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. దేశవాళీ టీ ట్వంటీల్లో అద్భుతమైన స్ట్రైక్ రేట్ కారణంగా వేలంలో ఫ్రాంచైజీలు దూబే కోసం తీవ్రంగానే పోటీపడ్డాయి. వేలంలో భారీ మొత్తం పలకడంతో ఈ యువ క్రికెటర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కనీసం క్రికెట్ కిట్ కూడా కొనడానికి ఇబ్బందిపడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగిన శుభమ్ దూబే వేలంలో వచ్చిన డబ్బులతో కుటుంబానికి సొంతిల్లు కొనబోతున్నట్టు చెప్పాడు. మొత్తం మీద పాన్ డబ్బా వాలా కొడుకు ఐపీఎల్ జాక్ పాట్ తో కోటీశ్వరుడయ్యాడంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.