Sonia Gandhi: రాజ‌కీయాల‌కు సోనియా గుడ్ బై!

వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీని.. రెండు దశాబ్దాల పాటు ముందుండి న‌డిపిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 05:06 PM IST

వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీని.. రెండు దశాబ్దాల పాటు ముందుండి న‌డిపిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. త్వర‌లోనే రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ప్రక‌టించారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న సోనియా.. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారు.

మూడు రోజుల పార్టీ ప్లీనరీలో 15వందల మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిస్తూ.. తన రిటైర్మెంట్‌ ప్రకటించారు సోనియా. సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో పార్టీలోనూ ఆమె త‌న‌దైన శైలిలో వ్యవ‌హ‌రించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో త‌ర‌చుగా ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయాన్ని ప‌క్కన పెట్టి.. నేత‌ల‌కు స్వేచ్ఛ క‌ల్పించారు. అంతేకాదు.. ఉపాధి హామీ వంటి కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చారు. ఆధార్ వంటి వ్యవ‌స్థను కూడా తీసుకురావ‌డంలో సోనియా త‌న‌దైన దూకుడుతో ముందుకు వెళ్లారు. ఐతే ఎక్కడా కూడా ప్రభుత్వంలో ప్రత్యక్ష పాత్ర పోషించ‌ని సోనియా.. తెర‌వెనుక మాత్రం అన్నీ తానై వ్యవ‌హ‌రించారు. అదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని.. యూపీఏ స‌ర్కారును స‌మ‌ర్థవంతంగా ప‌దేళ్ల పాటు పాలించేలా ముందుండి.. వ్యూహర‌చ‌న కూడా చేసిన ఘ‌న‌త సోనియాకు మాత్రమే దక్కుతుంది. కొన్ని దశాబ్దాల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కిన ఘటన కూడా సోనియా నేతృత్వంలోనే జరిగింది.

భారత్‌ జోడో యాత్రతో రాహుల్ జనాలకు చేరవయ్యారు. రాజకీయంగా పరిణతితో పాటు పార్టీ మీద పట్టు సాధించారు. పైగా సోనియాకు ఈ మధ్య వరుసగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయాలకు గుడ్‌ బై చెప్తూ సోనియా నిర్ణయం తీసుకున్నారు. ఐతే నెక్ట్స్ ఏంటి అనే చర్చ జరుగుతుండగా.. ఓ మాజీ అధ్యక్షురాలిగా, తల్లిగా.. రాహుల్‌ను, పార్టీని ముందుకు నడిపించడంలో సోనియా తెరవెనక కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయ్. 2024 ఎన్నికల్లో విజయానికి తనవంతు సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారు..