ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎంతో స్ట్రాంగ్ గా ఉండేది. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. బీఆర్ఎస్ పార్టీ దూకుడు, ఫిరాయింపు రాజకీయాలతో హస్తం పార్టీ వీక్ గా మారింది. మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలనే పట్టుదలతో సోనియాగాంధీ ఉన్నారట. రాష్ట్ర పార్టీ పనితీరుపై ఆమె స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారట. ఈక్రమంలోనే ఇటీవల షర్మిలతో ఆమె నేరుగా భేటీ అయ్యారని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్ ను మళ్లీ యాక్టివేట్ చేసే సంకల్పంతోనే హైదరాబాద్ వేదికగా ఈనెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని, 17న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం. తెలంగాణ ప్రకటించిన పార్టీగా కాంగ్రెస్ .. ఎందుకు రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లలేకపోతోందనే దానిపైనా ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుందని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీల్లో చేరిపోయిన కాంగ్రెస్ కీలక నేతలను మళ్లీ వెనక్కి రప్పించేలా వ్యూహ రచన కూడా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓ వైపు ఆకర్షణీయ సంక్షేమ పథకాలను ప్రకటిస్తూనే.. మరోవైపు వ్యవస్థాగత దిద్దుబాటు చర్యలను చేపట్టి తెలంగాణ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర కాంగ్రెస్ లోని ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపైనా సీడబ్ల్యూసీ సమావేశాల్లో మేధోమథనం జరుగుతుందని పేర్కొన్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డిని పూర్తిగా సైడ్ చేశారనే వార్తలతో ఆ వర్గం నాయకులు అసంతృప్తితో ఉన్నారు. దామోదర రాజనరసింహకు సీడబ్ల్యూసీలో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు కల్పించడంతో ఇతర సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారితోనూ అధిష్టానం మాట్లాడుతుందని సమాచారం. స్టార్ క్యాంపెయినర్లను ఖరారు చేసి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం చేసేలా కాంగ్రెస్ పెద్దలు అతిత్వరలోనే రాష్ట్ర లీడర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈనెల 17న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో సోనియాగాంధీ ప్రకటించనున్న 5 కీలక హామీలతో ప్రజల్లో కాంగ్రెస్ కు రేటింగ్ పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. ఆ మరుసటి రోజే (18న) సీడబ్ల్యూసీ సమావేశాల కోసం వచ్చిన పార్టీ జాతీయ నాయకులంతా తమకు కేటాయించిన తెలంగాణ నియోజకవర్గాలకు వెళ్లి సభలు, సమావేశాలను నిర్వహించనున్నారు. అక్కడ పార్టీ పరిస్థితిపై రిపోర్ట్స్ తయారు చేసిి అధిష్టానానికి ఇవ్వనున్నారు. ఈవిధంగా సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో మూడు రోజులపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పైనే చర్చ జరిగే పరిస్థితిని క్రియేట్ చేయనున్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వ్యూహరచన చేయనుంది.ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతోపాటు ముఖ్యనేతలు సోనియా, రాహుల్ తదితరులు హాజరుకానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆరోగ్య కారణాలతో రాలేకపోతున్నారు. ఇండియా కూటమి, ఎన్నికల్లో పొత్తులు, వ్యూహాలు, ప్రచారం గురించి సమావేశంలో చర్చించనున్నారు.