Telangana : ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం.. అసలు కారణం ఇదే..

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను (Telangana Emergence Celebrations) ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను (Telangana Emergence Celebrations) ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈసారి వేడుకలు గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ వేుడకులకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో పాటు మాజీ సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించారు. ఐతే చివరి నిమిషంలో సోనియా తెలంగాణ పర్యటన రద్దయింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరంగా ఉండబోతున్నారు. అనారోగ్యం, ఎండల కారణంగా సోనియా రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

దశాబ్ధి వేడుకలకు హాజరు కాలేకపోయినప్పటికీ.. వీడియో ద్వారా సోనియా తన సందేశం వినిపిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయ్. స్వయంగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్… దశాబ్ది వేడుకలకు సోనియాను ఆహ్వానించారు. ఆమె చేతుల మీదుగా అందెశ్రీ రచించిన రాష్ట్ర గీతం ఆవిష్కరించాలని రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు భావించారు. ఐతే అనారోగ్యానికి తోడు.. ప్రస్తుతం దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. దీంతో సోనియా.. ఈ వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.

ఇక జూన్ 2న ఉదయం గన్ పార్కు (Gun park) లోని అమరవీరుల స్థూపం దగ్గర… సీఎం రేవంత్ అమరవీరులకు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణ ఆవిష్కరిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. తెలంగాణ ఉద్యమకారులను సన్మానిస్తారు.