సౌథీకి విజయంతో వీడ్కోలు, కివీస్ పేసర్ రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ లో మరో స్టార్ పేసర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ జట్టులో 16 ఏళ్ళుగా కీలకమైన పేస్ బౌలర్ గా ఉన్న టిమ్ సౌథీ తన అంతర్జాతీయ కెరీర్ ను ఘనంగా ముగించాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ సౌథీకి గ్రాండ్ ఫేర్ వెల్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 06:45 PM IST

అంతర్జాతీయ క్రికెట్ లో మరో స్టార్ పేసర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ జట్టులో 16 ఏళ్ళుగా కీలకమైన పేస్ బౌలర్ గా ఉన్న టిమ్ సౌథీ తన అంతర్జాతీయ కెరీర్ ను ఘనంగా ముగించాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ సౌథీకి గ్రాండ్ ఫేర్ వెల్ ఇచ్చింది. హామిల్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌పై 423 పరుగుల తేడాతో రికార్డు విజయం అందుకుంది న్యూజిలాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, మొదటి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టామ్ లాథమ్ 63, విల్ యంగ్ 42, కేన్ విలియంసన్ 44 పరుగులు చేయగా మిచెల్ సాంట్నర్ 117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 35.4 ఓవర్లలో 143 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జో రూట్ 42 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హారీ బ్రూక్ గోల్డెన్ డక్ కాగా బెన్ స్టోక్స్ 27, ఓల్లీ పోప్ 24 పరుగులు చేశారు.

రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 101.4 ఓవర్లలో 453 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ యంగ్ 60 పరుగులు చేయగా కేన్ విలియంసన్ 204 బంతుల్లో 20 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 156 పరుగులు చేసి, టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీ సాధించాడు. డార్ల్ మిచెల్ 60, రచిన్ రవీంద్ర 44, టామ్ బ్లండెల్ 44, మిచెల్ సాంట్నర్ 49 పరుగులు చేశారు. 657 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, 47.2 ఓవర్లలో 234 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జాకబ్ బెథెల్ 76 , జో రూట్ 54 , అట్కిన్సన్ 43 పరుగులు చేశారు. బౌలింగ్ చేస్తూ గాయపడిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రాలేదు. తొలి రెండు టెస్టుల్లో ఓడిన న్యూజిలాండ్ ఈ విజయంతో వైట్ వాష్ పరాభవాన్ని తప్పించుకుంది. కాగా ఈ మ్యాచ్ తో సౌథీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. గత నెలలోనే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ కు ముందు ఫ్యామిలీతో భావోద్వేగానికి గురైన సౌథీకి ఇంగ్లాండ్ ప్లేయర్స్ గార్డ్ ఆఫ్ హానర్ తో సత్కరించారు.

2008 లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ళ పాటు కివీస్ పేస్ ఎటాక్ ను లీడ్ చేశాడు. తన కెరీర్ లో 107 టెస్టులు ఆడి 391 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనతను 15 సార్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా సౌథీ కొనసాగుతున్నాడు. 431 వికెట్లతో రిచర్డ్ హ్యడ్లి తొలి స్థానంలో ఉన్నాడు. కాగా సౌథీ బ్యాట్ తోనూ టెస్టుల్లో మెరుపులు మెరిపించాడు. కెరీర్ చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు బాదిన టిమ్ సౌథీ, తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ని 98 సిక్సర్లతో ముగించాడు. టిమ్ సౌథీ టెస్టు కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కంటే మొత్తం సిక్సర్ల సంఖ్యే ఎక్కువ. సౌథీ టెస్టు కెరీర్‌లో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.