ప్రస్తుతం ఎండలతో మండిపోతున్న జనానికి వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే వస్తాయని అంటున్నారు. గతేడాది అంచనా కంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్ లోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. కానీ ఈసారి ముందే వస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు.
ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై ప్రభావం చూపిన సూపర్ ఎల్ నినో (Super El Nino) వేగంగా క్షీణిస్తోంది. దాంతో వచ్చే నెల నాటికి తటస్థ పరిస్థితులు ఏర్పాటే అవకాశముంది. జూన్ నుంచి లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే మన దేశంలో నైరుతి రుతుపవనాలు నిర్ణీత తేదీ కంటే ముందే కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్, హిందూ మహాసముద్రాలలోని వాతావరణ పరిస్థితులను కూడా పరిశీలిస్తే నైరుతి ముందే వస్తుందనీ, మంచి వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) (IOD) పాజిటివ్ గా మారుతుండటంతో నైరుతి రుతుపవనాలకు అనుకూలమని చెబుతున్నారు. నైరుతి రాక, వర్షాల (Rains) తీరుపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) త్వరలోనే తొలి అంచనా నివేదిక విడుదల చేయనుంది.
ప్రస్తుతం మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. వచ్చే నెలలో వేడి మరింత తగ్గనుంది. జూన్ కి వాతావరణం చల్లబడుతుందని చెబుతున్నారు. లానినో, IOD ప్రభావంతో జూలై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో భారీగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుంది. ఈ సమయంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి మధ్య, వాయవ్య భారతం వైపు పయనిస్తాయంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణం వేడెక్కడంతో… తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి. వడ గాలులు వీస్తున్నాయి. జూన్ వరకు ఎండలు, వడగాలులు ఉంటాయని IMD గతంలో హెచ్చరించింది. కానీ నైరుతి రుతుపవనాల ముందే వస్తాయన్న నిపుణులు అంచనాలతో ఇక మే తర్వాత వాతావరణం చల్లబడే ఛాన్స్ ఉంది.