ఏపీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. దీంతో స్పీకర్ సభను సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ముందుగా సభను కాసేపు వాయిదా వేశారు.
తాత్కాలిక విరామం తరువాత తిరిగి సభ ప్రారంభమైంది. సభా సాంప్రదాయాలకు విరుద్దంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని తెలిపారు. టీడీపీ సభ్యుల తీరు సరైనది కారదని హెచ్చరించారు. బాలకృష్ణ చేసిన చర్యను మొదటి తప్పిదంగా భావించి సభలో కొనసాగిస్తున్నాం అన్నారు. మరోసారి మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం లాంటివి పునరావృతం కాకూడదని సూచించారు. ఆతరువాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు. మళ్లీ స్పీకర్ పోడియం ముట్టడించి నినాదాలు చేశారు. సభా నియమాలను పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సభాపతి మాటలను పట్టించుకోకుండా చంద్రబాబు అరెస్ట్ పై వాగ్వాదానికి దిగారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై ఆగ్రహించిన స్పీకర్ పలువురిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటూ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను తమ ఫోన్లో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. దీంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్, పయ్యావుల కేశవ్ ను అసెంబ్లీ సెషన్స్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి సహా మిగిలిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఒక్క రోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వెంటనే అచ్చెనాయుడు, నిమ్మల రామానాయుడు, బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్న రాజప్ప, పయ్యావుల కేశవ్ తదితరులు చంద్రబాబు ‘అక్రమ కేసులు ఎత్తివేయాలి.. సైకో జగన్ డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ సభ నుంచి బయటకు వచ్చారు.