శబరిమలలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ పెరిగిన సంగతి తెలిసిందే.. కాగా అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కిలోమీటర్ల మేర భక్తులు గంటల తరబడి వరుసల్లో వేచి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే రద్దీ పెరగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 28, జనవరి 4, 11, 18 తేదీల్లో 07113/07114 ప్రత్యేక రైలు కాకినాడ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైలు సాయంత్రం 5.40కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మర్నాటి రాత్రి 10 గంటలకు కొట్టాయం స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ఈ నెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30కి కొట్టాయంలో బయలుదేరి రెండో రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడ చేరుతుంది.
కాగా శబరిమలకు ప్రత్యేకంగా నడుపుతున్న ఈ రైలు సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ నుంచి శబరిమల..
జనవరి 6, 13 తేదీల్లో 07009/07010 ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05కి కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు జనవరి 8, 15 తేదీల్లో కొట్టాయంలో అర్ధరాత్రి 12.30కి బయలుదేరి రెండోరోజు ఉదయం 5గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలుకు ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుంది. అయ్యప్ప భక్తులు ఈ రైళ్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 51 రైళ్లు..
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్ – జనవరి మాసాల్లో వివిధ తేదీల్లో మొత్తంగా 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. వివిధ తేదీల్లో రాకపోకలు కొనసాగించే ఆ రైళ్ల నెంబర్లు, తేదీలతో పాటు పలు వివరాలను ప్రకటనలో తెలియజేశారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యేవాటితో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి బయల్దేరి ఏపీ, తెలంగాణ మీదుగా నడిచేవి కూడా చాలా ఉన్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఆ రద్దీని బట్టి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.