వాంఖడేలోనూ స్పిన్నర్ల హవా చివరి సెషన్ లో కివీస్ జోరు

సొంతగడ్డపై సుధీర్ఘ కాలంగా తర్వాత టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న భారత్, న్యూజిలాండ్ తో చివరి టెస్టులో తొలిరోజు బౌలింగ్ లో ఆధిపత్యం కనబరిచింది. మన స్పిన్నర్లు తిప్పేయడంతో కివీస్ 235 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ను ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేశారు.

  • Written By:
  • Publish Date - November 1, 2024 / 06:02 PM IST

సొంతగడ్డపై సుధీర్ఘ కాలంగా తర్వాత టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న భారత్, న్యూజిలాండ్ తో చివరి టెస్టులో తొలిరోజు బౌలింగ్ లో ఆధిపత్యం కనబరిచింది. మన స్పిన్నర్లు తిప్పేయడంతో కివీస్ 235 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ను ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేశారు. డివాన్ కాన్వే 4 పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో అవుటవగా.. కెప్టెన్ టామ్ లాథమ్, విల్ యంగ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 44 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ల ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఒకవైపు జడేజా, మరోవైపు సుందర్ కివీస్ ను దెబ్బకొట్టారు. 44 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ని వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రచిన్ రవీంద్ర కూడా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్‌లో రచిన్‌ను ఔట్ చేయడం సుందర్‌కు మూడోసారి. సుందర్ వేసిన 28 బంతులు ఎదుర్కొన్న రచిన్ 12 పరుగులు చేసి మూడు సార్లు ఔటయ్యాడు.

తర్వాత విల్ యంగ్, డార్ల్ మిచెల్ కలిసి నాలుగో వికెట్‌కి 87 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న వేళ రవీంద్ర జడేజా మరోసారి తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు.71 పరుగులు చేసిన విల్ యంగ్‌ని అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో టామ్ బ్లండెల్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక్కడ నుంచి జడేజా స్పిన్ మ్యాజిక్ కు కివీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. గ్లెన్ ఫిలిప్స్‌ ,ఇష్ సోదీని కూడా జడ్డూనే ఔట్ చేశాడు. అటు మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సందర్ చెలరేగడంతో కివీస్ వరుస వికెట్లు కోల్పోయింది. 82 పరుగులు చేసిన డార్ల్ మిచెల్ ఔటైన తర్వాత న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్‌కి 4 వికెట్లు దక్కాయి. టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను సాధించడం జడేజాకు 14వ సారి. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అయిదో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్‌లను 311 వికెట్ల టెస్టు రికార్డును అధిగమించాడు.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లను రెండు సందర్భాల్లో తీసి న్యూజిలాండ్‌ను జడ్డూ కోలుకోలేని దెబ్బతీశాడు. మరోవైపు ఆకాశ్ దీప్ ఓ వికెట్ తీయగా మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయలేకపోయారు. కాగా ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఒక మార్పు చేశారు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా బూమ్రాకు రెస్ట్ ఇచ్చారు. బూమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. కాగా చివరి సెషన్ లో న్యూజిలాండ్ అనూహ్యంగా పుంజుకుంది. స్పిన్ పిచ్ పై మరోసారి మన బ్యాటర్లు తడబడ్డారు. రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్, రోహిత్ శర్మ, కోహ్లీతో పాటు నైట్ వాచ్ మెన్ గా వచ్చిన మహ్మద్ సిరాజ్ ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 149 రన్స్ వెనుకబడి ఉంది.ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న కివీస్ 2-0 ఆధిక్యంలో ఉండగా… భారత్ చివరి మ్యాచ్ లో నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.