హోరాహోరీ తప్పదనుకున్న పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చిన టీమ్‌ఇండియాకు.. తేలిగ్గా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో శ్రీలంక నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. స్పిన్నర్ల స్వర్గధామంగా మారిన కొలంబో పిచ్‌ను గొప్పగా ఉపయోగించుకున్న లంకేయులు భారత బ్యాటర్లకు గట్టి సవాలే విసిరారు. ఇన్నింగ్స్‌ను ఘనంగా మొదలుపెట్టి 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించిన టీమ్‌ఇండియాను.. యువ స్పిన్నర్ వెల్లలాగె, పార్ట్‌టైమర్ అసలంక కొలంబో పిచ్‌పై డ్యాన్స్ చేయించి, 213 పరుగులకే పరిమితమయ్యేలా చేశారు. బౌలింగ్‌లోనూ భారత్‌కు అదిరే ఆరంభం దక్కినా.. లంక అంత తేలిగ్గా వదిలితేనా! గత మ్యాచ్ హీరో కుల్‌దీప్ యాదవ్ మరోసారి విజృంభించడంతో భారత్ గట్టెక్కేసింది. సూపర్-4లో వరుసగా రెండో విజయం సాధించిన భారత్ ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది.
భారత్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ల ఆధిపత్యం చూశాక.. ఆరంభం నుంచే రోహిత్ స్పిన్ దాడి మొదలుపెడతాడేమో అనిపించింది. కానీ అతను బుమ్రా, సిరాజ్‌లనే దించాడు. వాళ్లిద్దరూ లంక బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టారు. బుమ్రా.. స్వల్ప వ్యవధిలో నిశాంక , కుశాల్ మెండిస్ లను పెవిలియన్ చేర్చాడు. కరుణరత్నెను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. పేసర్ల బౌలింగ్‌కే లంక బ్యాటర్లు నిలవలేకపోతున్నారంటే, స్పిన్నర్లు దిగితే ఇంకెలా ఉంటుందో అనుకుంటే.. అసలంక , సమరవిక్రమలు, కుల్‌దీప్, జడేజాలను బాగానే ఎదుర్కొన్నారు. లక్ష్యం చిన్నదే కావడంతో భారత్‌లో కంగారు మొదలైంది. అయితే ఈ దశలోనే కుల్‌దీప్ మాయాజాలం మొదలైంది.
అతను వరుస ఓవర్లలో సమరవిక్రమ, అసలంకలను ఔట్ చేసి లంకను గట్టి దెబ్బ తీశాడు. పతనం దిశగా సాగుతున్న లంకలో ధనంజయ, వెల్లలాగే మళ్లీ ఆశలు రేపారు. ఈ జోడీ కొంతసేపు ఆచితూచి ఆడి, ఆ తర్వాత ఎదురుదాడి చేయడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. 4 వికెట్లు చేతిలో ఉండగా 13 ఓవర్లలో 57 పరుగులే చేయాల్సి రావడంతో భారత్‌కు కష్టమే అనిపించింది. కానీ ధనంజయను ఔట్ చేసి జడేజా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వెల్లలాగె మాత్రం పోరాటాన్ని కొనసాగించాడు. అయితే మరో ఎండ్‌లో బ్యాటర్లను భారత్ నిలవనీయలేదు. తీక్షణను హార్దిక్ పెవిలియన్ చేర్చగా.. రజిత , పతిరనలను ఒకే ఓవర్లో అద్భుతమైన డెలివరీలతో బౌల్డ్ చేసిన కుల్‌దీప్ లంక కథ ముగించాడు.