బూమ్రాకు తోడుగా స్టార్ పేసర్ ముంబై ప్లాన్ అదిరిందిగా

ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. గత సీజన్ కు ముందు కెప్టెన్సీ మార్పు ఆ జట్టు ప్రదర్శనపై గట్టిగానే ప్రభావం చూపింది. హార్థిక్ పాండ్యా అనుకున్న రీతిలో జట్టును విజయపథాన నడిపించలేకపోయాడు.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 07:58 PM IST

ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. గత సీజన్ కు ముందు కెప్టెన్సీ మార్పు ఆ జట్టు ప్రదర్శనపై గట్టిగానే ప్రభావం చూపింది. హార్థిక్ పాండ్యా అనుకున్న రీతిలో జట్టును విజయపథాన నడిపించలేకపోయాడు. ఫలితంగా ముంబై గత సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. ఈ వైఫల్యాల నుండి జట్టు ముంబై కొన్ని పాఠాలు నేర్చుకుంది. మహేల జయవర్ధనే తదుపరి సీజన్‌కు ప్రధాన కోచ్‌గా తిరిగి రాగా.. కొన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ చేసినప్పటి నుంచి ముంబైలో లుకలుకలు మొదలయ్యాయని.. రోహిత్, సూర్య, బుమ్రాలు వేలంలోకి వస్తారని అంతా భావించారు. కానీ, ముంబై మాత్రం తమ స్టార్ ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకుని.. ఆ ఊహాగానాలకు తెరదించింది.

కొత్త సీజన్ పై ఫోకస్ పెట్టిన ముంబై యాజమాన్యం మెగావేలం కోసం మెగా ప్లాన్ తోనే రెడీ అయింది. గతంలో తమకు ఆడిన స్టార్ బౌలర్ ను వేలంలో దక్కించుకునేందుకు సిద్ధమైంది. మెగావేలంలో ముంబై ఇండియన్స్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను టార్గెట్ చేసినట్టు సమాచారం.. లెఫ్టార్మ్ బౌలర్ అయిన బౌల్ట్ తొలి ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్ట. ముంబై అతన్ని కొనుగోలు చేస్తే వారి పేస్ ఎటాక్ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం. బుమ్రా, బోల్ట్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్టుకు అంత సులభం కాదు. ట్రెంట్ బౌల్ట్‌కు ముంబై ఇండియన్స్ తరపున ఆడడం కొత్తేమీ కాదు. 2020 మరియు 2021 రెండు సీజన్లలో ముంబై తరుపున ఆడాడు. 2 సీజన్లలో 29 మ్యాచ్‌లు ఆడి 38 వికెట్లు తీశాడు. 2020లో ముంబైని ఛాంపియన్‌గా నిలపడంలో బోల్ట్ కీలక పాత్ర పోషించాడు. అయితే 2022 వేలం సమయంలో బౌల్ట్ ను ముంబై వదిలేసింది. ఇప్పుడు ముంబై యాజమాన్యం మళ్లీ బౌల్ట్ ను తమ జట్టులోకి తీసుకునేందుకు ఉత్సాహంగా ఉంది.

2022లో ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. బౌల్ట్ గత మూడు సీజన్లలో రాజస్థాన్ తరుపున 42 మ్యాచ్‌లలో 45 వికెట్లు తీశాడు. ఇక బోల్ట్ ఐపీఎల్ కెరీర్ చూస్తే ఓవరాల్ గా 104 మ్యాచ్‌ల్లో 121 వికెట్లు తీశాడు. బోల్ట్ తన పేస్, స్వింగ్, బౌన్స్ , యార్కర్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు. బూమ్రాకు తోడు జట్టులో బౌల్ట్ కూడా ఉంటే ఖచ్చితంగా పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్ లోనూ ముంబైకి అడ్వాంటేజ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కాగా మెగా వేలంలో 574 మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవ్వగా… 207 స్లాట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయి. జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం ఆటగాళ్ళ వేలం జరగబోతోంది.