ఐపీఎల్ అంటేనే సంచలనాలకు చిరునామా… ఈ సంచలనాలు కేవలం గ్రౌండ కే పరిమితం కాదు… ఆటగాళ్ళ వేలంలోనూ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధర పలికితే… మరికొందరికి షాక్ తగిలింది. కనీసం బేస్ ప్రైస్ కు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు బిడ్ వేయలేదు. వేలంలో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చినా.. అమ్ముడుపోని వారు చాలా మందే ఉన్నారు.అంతర్జాతీయ మ్యాచ్‌లలో అనుభవం, క్రేజ్ ఉన్న ఆటగాళ్లని సైతం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పక్కన పెట్టేశాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. అలాగే భారత్ ప్లేయర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి వాళ్ళకు కూడా నిరాశ తప్పలేదు. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి ఆడారు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అయినా ఈసారి ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు. వయసు పైబడటం, పెద్దగా ఫామ్‌లో లేకపోవడం దీనికి కారణం కావచ్చు.
పృథ్వీ షా ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 147.5 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు చేశాడు. అయితే షా గత కొన్ని సీజన్లుగా పెద్దగా రాణించలేదు. అందుకే అతన్ని ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. పైగా షా ఓవర్ వెయిట్ అయ్యాడు. అతనిపై ఫ్రాంచైజీలు అనాసక్తి చూపడానికి ఇదీ ఒక కారణంగా భావిస్తున్నారు. ఇక ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కు టీ ట్వంటీల్లో మంచి రికార్డు లేకపోవడంతో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. అటు ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్‌లో లేకపోవడం వల్ల అతన్ని ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. అలాగే కేన్ విలియమ్సన్ , నవీన్ ఉల్ హక్, సికిందర్ రాజా, అల్జరీ జోసెఫ్ , డారిల్ మిఛెల్ వంటి విదేశీ ఆటగాళ్లకూ నిరాశే మిగిలింది.
ఇదిలా ఉంటే వేలంలో పలువురు భారత స్టార్ క్రికెటర్లకు సైతం షాక్ తగిలింది. గత కొన్నేళ్ళుగా ఐపీఎల్ లో అదరగొట్టిన శార్థూల్ ఠాకూర్ కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. అతన్ని కనీస ధరకు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అలాగే పేసర్ బౌలర్ ఉమేశ్ యాదవ్, సన్ రైజర్స్ కు ఆడిన మయాంక్ అగర్వాల్ కూ సైతం బిడ్లు రాలేదు. చాలా మంది ఆల్ రౌండర్లకు మొండి చేయే ఎదురైంది. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ పుణ్యమా అని ఆల్ రౌండర్ల అవసరం జట్లకు తగ్గియిందనే వాదనలూ ఉన్నాయి. అందుకే వారికి డిమాండ్ తగ్గిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గత కొన్ని సీజన్లుగా పలు ఫ్రాంచైజీల విజయాల్లో హీరోలుగా ఉన్న ఆటగాళ్ళు మెగావేలంలో జీరోలుగా మిగిలారన్న వాదన వినిపిస్తోంది.