Rajaiah: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య కేసులో కొత్త ట్విస్ట్‌

స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చుట్టూ వరుస వివాదాలు చుట్టుకుంటున్నాయ్. రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి సంచలనంగా మారిన జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఉదంతం.. మళ్లీ తెరపైకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 06:20 PM IST

రాజయ్య తనను వేధిస్తున్నారని.. మూడు నెలల కింద నవ్య మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఆయనే స్వయంగా వెళ్లి.. రాజీ కుదుర్చుకున్నాడు. దీంతో వివాదం ముగిసిపోయిందని అనుకున్నారు అంతా ! అక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. ఇప్పుడు మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. వేధింపుల కేసులో రాజీలో భాగంగా.. గ్రామ అభివృద్ధి కోసం 25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన రాజయ్య.. ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని నవ్య ఆరోపిస్తున్నారు.

మూడు నెలలు గడిచినా ఇప్పటివకరు ఒక్క పైసా ఇవ్వలేదని.. తనకు డబ్బులు అక్కర్లేదన్న నవ్య.. ఎమ్మెల్యే రాజయ్య పై సరికొత్త ఆరోపణలు చేశారు. తాను అప్పు తీసుకున్నట్లుగా బాండ్ పేపర్ మీద సంతకం చేయాలని.. రాజయ్య మనుషులు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. తాను డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయినట్టు.. తప్పుగా మాట్లాడుతున్నారని నవ్య ఆరోపించారు. తాను మహిళల రక్షణ కోసం పోరాడుతున్నానని.. అంతేకానీ ఎప్పుడు, ఎక్కడా డబ్బులు తీసుకోలేదని క్లియర్‌గా చెప్పారు.

గతంలో రాజయ్య మీద తాను చేసిన ఆరోపణలు అవాస్తవం అని చెప్పాలంటూ.. ఎమ్మల్యే మనుషులు ఒత్తిడి తీసుకువస్తున్నారని నవ్య అంటున్నారు. ఎమ్మెల్యే పంపిన బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టమని తన భర్త కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పంపిన బాండ్ పేపర్‌లో తనకు 20 లక్షలు అప్పు ఇస్తున్నట్లు రాశారని అంటున్న నవ్య… బాండ్‌పై సంతకం చేయమని తన భర్త కూడా ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు.

దీంతో రాజయ్యతో పాటు ఆమె భర్త ప్రవీణ్ మీద కూడా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు నవ్య. ఈ ఇద్దరితో పాటు.. ఎంపీపీ మీదా.. ఎమ్మెల్యే పీఏ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా సాగుతున్న ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ కనిపించింది. తనకు 7లక్షల రూపాయలు ఇచ్చారని సర్పంచ్​నవ్య భర్త ప్రవీణ్​కుమార్​ఒప్పుకున్నాడు. అందుకే తన భార్య నవ్యపై తాను ఒత్తిడి చేశానని చెప్పాడు. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే రాజయ్య చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. మరి ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది హాట్‌టాపిక్‌గా మారింది.