దాదాపు వంద ఏళ్లకు పైగా కొనసాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదానికి 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎండ్ కార్డ్ పడింది. వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించిన కోర్టు.. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు వేరే ప్రదేశంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో మందిర నిర్మాణం రూట్ క్లియర్ అయింది. మూడేళ్ల నుంచి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయ్. వచ్చే ఏడాది జనవరిలో ఆలయాన్ని ప్రారభించనున్నారు. ఇలాంటి సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయోధ్యలోని రామమందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయ్.
భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం తవ్వకాల సమయంలో.. పురాతన దేవాలయం, విగ్రహాలు, స్తంభాల అవశేషాలు బయటపడ్డాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, పురాతన నిర్మాణ అవశేషాల ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో అనేక విగ్రహాలు, పురాతన ఆలయ స్తంభాలు ఉన్నాయ్. మందిర నిర్మాణ ప్రదేశంలో వీటిని తాత్కాలికంగా ఓ షెడ్‌లో భద్రపరిచారు. మూడేళ్ల కిందట అయోధ్యలో రామజన్మభూమి స్థలానికి సమీపంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న స్తంభాలు బయటపడ్డాయ్. నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పుడు అక్కడ వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా శివలింగ సహా దేవతమూర్తుల విగ్రహాలు బయటపడ్డాయ్. ఇందులో ఐదు అడుగుల ఎత్తైన శివలింగం, నల్ల గీటురాయి స్తంభాలు ఏడు, ఎర్ర రాతిఇసుక ధ్వజాలు ఆరు, పలు దేవతా విగ్రహాలు ఉన్నాయి.
ఇంతకు ముందే కలశం, రాతి పుష్పాల వంటి అనేక ప్రాచీన వస్తువులు ఆ ప్రదేశంలో కనిపించాయి. ఇవన్నీ అయోధ్యలోని పురాతన రామాలయానికి సంబంధించినవేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఇక అటు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ స్వామీజీల ప్రకారం.. రామమందిర ప్రారంభోత్సవం జనవరి మూడో వారంలో ఉండే అవకాశం ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో జరిగే రామమందిర ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. అయితే, తుది షెడ్యూల్ విషయంలో మాత్రం ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆమోదం రావాల్సి ఉంటుంది.