CHANDRABABU NAIDU: విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగంతకుడు రాయితో దాడి చేశారు. చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో, ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఒక ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. అయితే, రాయి చంద్రబాబు పక్కకు పడటంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన ఆగంతకుడి కోసం గాలింపు చేపట్టారు.
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి హామీ
ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కూడా తనపై రాళ్లు వేశారని, క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదని, అలాంటిది ఈ రాళ్లకు భయపడతానా అని చంద్రబాబు అన్నారు. జగన్‌పై దాడులు చేస్తుంటే పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా అని విమర్శించారు. జగన్‌పై దాడి జరిగిన సభలో కరెంటు పోయిందని, దానికి ఎవరు బాధ్యత వహించాలన్నారు. కరెంట్ బంద్ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విజయవాడలో ఇదివరకే డ్రామా చేశారని, ఇప్పుడు తమ సభలపై కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
‘‘విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మొరిగాయి. రాళ్లు నేను వేయించినట్లు కొందరు మాట్లాడారు. విజయవాడలో నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా. జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయి హత్యను నా మీదకు నెట్టాలని ప్రయత్నించారు’’ అని చంద్రబాబు అన్నారు. ఈ ఘటనకు ముందు తెనాలిలో పవన్ కళ్యాణ్‌పై రాయితో దాడి జరిగింది. అయితే, ఆ రాయి పవన్‌కు దూరంగా పడటంతో ఎలాంటి గాయం కాలేదు.