కర్ణాటకలోనే కాదు ఇతర భాషల్లోనూ ప్రకాష్ రాజ్ అనేక చిత్రాలు చేశారు. అంతేకాకుండా రాజకీయాలపై తనదైన శైలిలో బాణాలు ఎక్కుపెడుతూ ఉంటారు. బీజేపీ పై వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంవీ కళాశాలలో నిర్వహించిన డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ అనే అంశంపై ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకి మంగళవారం హాజరయ్యారు. ఇతని రాకను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అతనిని లోనికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కళాశాల యాజమాన్యం బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరించింది. దీంతో వారు బయట నుంచే ఆందోళనలు చేపట్టారు.
ఈక్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాలేజ్ లో ప్రైవేట్ ప్రోగ్రాంలు ఎందుకు నిర్వహిస్తున్నారు అని నిలదీశారు. దీనికి గల కారణం కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయడమే అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఈ విద్యార్థులు కూడా బీజేపీకి చెందిన ఏబీవీపీ, భజరంగదళ్ కార్యకర్తలుగా భావిస్తున్నారు. ఇలాంటి తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ కార్యక్రమం ముగించుకొని ప్రకాష్ రాజ్ వెళ్లిపోయాక కాలేజ్ పరిసరప్రాంతాలతో పాటూ, ఈవెంట్ జరిగి హాలులో గోమూత్రం చల్లి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఏదైనా అంటు, మైల జరిగినప్పుడు దోష నివారణ నిమిత్తం ఇలాంటి పుణ్యాహవచన కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇక్కడ ఇలాంటి వింత పరిస్థితులు ఏర్పడటంతో ప్రకాష్ రాజ్ ను వీళ్లు అంటుగా భావిస్తున్నట్లు చెప్పకతప్పదు.
T.V.SRIKAR