గదర్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న బాలీవుడ్ నటుడు సన్నీడియోల్‌కు భారీ ఊరట లభించింది. ఆయన విల్లా వేలానికి బ్యాంకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవడమే అందుకు కారణం. బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అయిన సన్నీ డియోల్.. విల్లా వేలానికి ఇచ్చిన నోటీసును బ్యాంక్ ఆఫ్ బరోడా వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి ప్రకటన కూడా చేసింది. సాంకేతిక సమస్యలను కారణంగా చూపి, నోటీసును వెనక్కి తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. లోన్ తిరిగి చెల్లించని కారణంగా సన్నీకి చెందిన ఓ విల్లాను వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రకటన విడుదల చేసింది.
తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీతోపాటు జుహూలో ఉన్న సన్నీ విల్లాను గ్యారంటీగా చూపించి ఆయన ఈ రుణాన్ని పొందారని.. దాదాపు 56 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. దీంతో లోన్ రికవరీలో భాగంగా సన్నీ విల్లాను వేలం వేయనున్నట్లు మీడియాలో అడ్వర్‌టైజ్‌మెంట్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 25న ఈ వేలం జరగనుందని రకరకాల కథనాలు వినిపించాయ్. ఇది బీటౌన్‌లో చర్చకు దారితీసింది. ఐతే ఇప్పుడు ఆ నోటీసును వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ మరో ప్రకటన చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. సాంకేతిక కారణాలు చూపుతూ.. నోటీసులు వెనక్కి తీసుకోవడం విడ్డూరంగా ఉందంటూ.. బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది పెద్ద రచ్చకే దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్ నేతలు మరింత స్ట్రాంగ్‌గా బీజేపీని నిలదీసే చాన్స్ ఉంది. ఇదంతా ఎలా ఉన్నా.. గదర్ 2తో సన్నీకి గ్రాండ్ సక్సెస్ వచ్చింది. ఆ మూవీ.. మంచి వసూళ్లు రాబడుతోంది.