REVANTH REDDY: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఓటుకు నోటుకు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు సుప్రీం ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
PV Narasimha Rao: తెలుగోడికి భారతరత్న.. పీవీ గురించి ఎవరికీ తెలియని విషయాలు..
ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణలో సీఎం, హోం మంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. నిజంగా ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉంటే తాము ఎలా చూస్తూ ఊరుకుంటామని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటిషనర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లో స్పందించాలని అందులో పేర్కొంది. అయితే.. ఈ నోటీసులపై రేవంత్, తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.