Navneet Kaur: సుప్రీంలో ఎంపీ నవనీత్ కౌర్‌కు ఊరట.. SC సర్టిఫికెట్‌పై అనుకూల తీర్పు

ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. తాను ఎస్సీ కాకపోయినా.. ఎస్సీ అంటూ నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అక్రమంగా మోచీ కులం సర్టిఫికెట్ తీసుకున్నారని ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 03:02 PM IST

Navneet Kaur: సినీ నటి, బీజేపీ అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. క్యాస్ట్‌ సర్టిఫికెట్‌‌పై నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అమరావతి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నవనీత్ కౌర్.. 2019లో స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. అయితే, ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. తాను ఎస్సీ కాకపోయినా.. ఎస్సీ అంటూ నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Forbes Richest List 2024: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా విడుదల.. టాప్-10లో అంబానీ.. అదానీ స్థానం ఎంతంటే..

అక్రమంగా మోచీ కులం సర్టిఫికెట్ తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. నవనీత్‌ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ అక్రమంగా పొందిందని గుర్తించింది. ‘మోచి’ కుల ధృవీకరణ పత్రాన్ని నవనీత్ కౌర్ మోసపూరితంగా పొందిందని హైకోర్టు అప్పట్లో పేర్కొంది. దీంతో నవనీత్ ‘సిక్కు-చామర్’ కులానికి చెందినదని రికార్డులు సూచిస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొంది. దీంతో ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయడంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. 2021 జూన్‌లో ఈ తీర్పు వెల్లడించింది. అయితే, బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా నవనీత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఈ అంశంలో పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై జోక్యం చేసుకోలేమని చెప్పింది. నవనీత్ క్యాస్ట్ సర్టిఫికెట్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆమెకు భారీ ఊరట లభించినట్లైంది. ఇటీవలే నవనీత్ కౌర్ బీజేపీలో చేరింది. ఈ సారి కూడా మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్ధిగా నవనీత్ కౌర్ పోటీ చేయబోతుంది.